కేజీ బేసిన్ గ్యాస్ ధర పెంపులో కుమ్మక్కయ్యారంటూ వచ్చిన ఫిర్యాదుపై సంచలన నిర్ణయం
కృత్రిమ కొరత సృష్టిస్తూ గ్యాస్ ధరలు పెంచేస్తున్నారు
ఇది దేశ ఆర్థిక వ్యవస్థకే చేటు.. ఖజానాపై ఏటా రూ.54 వేల కోట్ల భారం
రిలయెన్స్‌కు ఏకంగా రూ.1.2 లక్షల కోట్ల ఆయాచిత లబ్ధి
న్యూఢిల్లీ: అవినీతిపై దర్యాప్తు పేరుతో గతాన్ని తవ్వుతూ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలకు, బీజేపీ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు మరో సంచలనానికి తెరదీశారు. ఏకంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఎం.వీరప్ప మొయిలీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ దేవరా, రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీలపై క్రిమినల్ కేసుల నమోదుకు ఆదేశించారు. కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్ నుంచి ఉత్పత్తి అయ్యే సహజ వాయువుకు అడ్డగోలుగా రేట్లను నిర్ణయించడంలో వీరంతా కుమ్మక్కయ్యారంటూ వచ్చిన ఫిర్యాదుపై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఏప్రిల్ 1 నుం చి గ్యాస్ ధర పెంచాలన్న నిర్ణయాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మంగళవారమిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు గుప్పించా రు. గ్యాస్ ధరల కుమ్మక్కులో పాలుపంచుకున్నవారిపై అవినీతి నిరోధక చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా ఏసీబీని ఆదేశించినట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని నడుపుతున్న కేజ్రీవాల్... అదే పార్టీ అవినీతి బాగోతాలను తవ్వితీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కామన్వెల్త్ క్రీడల్లో అవినీతిపై దర్యాప్తునకు ఆదేశించిన ఆయన.. తాజాగా కేంద్ర మంత్రులు, కార్పొరేట్ దిగ్గజాలపై గురిపెట్టడం గమనార్హం. ఆర్‌ఐఎల్ సంస్థతోపాటు హైడ్రోకార్బన్స్ మాజీ డెరైక్టర్ జనరల్ వీకే సిబల్ కూడా ఈ కేసు ఎదుర్కొననున్నారు. అయితే కేంద్ర మంత్రిపై దర్యాప్తు చేసే అంశం ఢిల్లీ ఏసీబీ పరిధిలోకి వస్తుందా లేదా అన్న విషయంలో అస్పష్టత నెలకొంది. విలేకరుల సమావేశం అనంతరం కేజ్రీవాల్ ప్రభుత్వం గ్యాస్ కుమ్మక్కు వ్యవహారంపై ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అందులో వివరాలు..
గ్యాస్ రేట్లలో కుమ్మక్కు వ్యవహారం దేశ ఆర్థిక వ్యవస్థకే విఘాతం. ఇది జాతి వ్యతిరేక చర్య.
మాజీ కేబినెట్ కార్యదర్శి టీఎస్‌ఆర్ సుబ్రహ్మణ్యం, మాజీ నేవీ చీఫ్ అడ్మిరల్ తహిల్యానీ, ప్రముఖ న్యాయవాది కామిని జైశ్వాల్, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మలు దాఖలు చేసిన ఫిర్యాదులో ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి.
గ్యాస్ ఉత్పత్తిని కావాలనే తగ్గిస్తూ దేశంలో చమురుకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు.
గ్యాస్ ధర పెంపుతో దేశ ఖజానాపై ఏటా రూ.54,500 కోట్ల భారం పడుతుందని, భవిష్యత్తులో ఆర్‌ఐఎల్‌కు 1.2 లక్షల కోట్ల ఆయాచిత లబ్ధి చేకూరుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సహజ వాయువు ధరను పెంచడం వల్ల రవాణా, విద్యుత్, ఎరువుల ఉత్పత్తి ఖర్చులు భారీగా పెరుగుతాయని ఇది చివరకు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఏసీబీ దర్యాప్తు నేపథ్యంలో చమురు ధరల పెంపు నిర్ణయాన్ని నిలిపివేయాలంటూ ప్రధానికి, పెట్రోలియం మంత్రికి లేఖ రాస్తా. దర్యాప్తునకు అన్ని విభాగాలు సహకరించేలా ఆదేశించాలని కోరతా.
గ్యాస్ ఒక ఎంఎంబీటీయూ (మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్) ధరను ఏప్రిల్ 1 నుంచి ప్రస్తుతం ఉన్న 4.2 డాలర్ల (రూ.262.25) నుంచి 8 డాలర్ల(రూ.524.20)కు పెంచాలని రిలయన్స్ అడగ్గానే కేంద్ర మంత్రి గుడ్డిగా అందుకు తలూపేశారు. జాతి ప్రయోజనాలకు ఫణంగా పెట్టి రిలయెన్స్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు.
ఆరోపణలు నిరాధారం: రిలయెన్స్
తమపై ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలన్నీ నిరాధారమని రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఒక ప్రకటనలో తెలిపింది. వాటి ఆధారంగా ఢిల్లీ ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని ఆదేశించడం ఆశ్చర్యకరమని పేర్కొంది. గ్యాస్ విషయంలో సుప్రీంకోర్టులో ఇంతకుముందు పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తులే ఇప్పుడు ఈ ఫిర్యాదు చేశారని, దాన్ని పట్టుకొని కేసులు పెట్టాలని చూడడం సరికాదని ప్రకటనలో తెలిపారు.
ఆయన అజ్ఞానానికి చింతిస్తున్నా: మొయిలీ
కేజ్రీవాల్ తనపై చేసిన ఆరోపణలను మంత్రి వీరప్ప మొయిలీ తీవ్రంగా ఖండించారు. ‘‘పెట్రో ఉత్పత్తుల ధరలను నిపుణుల కమిటీ సూచనల మేరకు నిర్ణయిస్తాం తప్పా.. సొంత నిర్ణయాలు ఉండవు. ఈ విషయం తెలియని కేజ్రీవాల్ అజ్ఞానానికి నేను చింతిస్తున్నా. ప్రభుత్వం ఎలా నడుస్తుంది.. ఈ నిర్ణయాలు ఎలా తీసుకుంటారన్న అంశాలు ఆయన తెలుసుకోవాలి. సీఎన్‌జీ, పీఎన్‌జీ రేట్లను తగ్గించేం దుకు నేను ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నా’’ అని పేర్కొన్నారు. బావిలోంచి నీరు తీసినట్టే చమురు తీస్తారని ఆయన భావిస్తున్నట్టు ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ కూడా కేజ్రీవాల్‌పై మండిపడ్డాయి.
రాజ్యాంగం, చట్టాల పరిధిలో ఏ విచారణకైనా తమ పార్టీ నేతలు సిద్ధమేకానీ, ఆ విచారణ రాజకీయ ప్రేరేపితం కాకూడదని ఏఐసీసీ ప్రతినిధి అజయ్ మాకెన్ అన్నారు. తన లక్ష్యాలు సాధించేందుకు కేజ్రీవాల్ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, రాజకీయ కక్షలతో పారిశ్రామికవేత్తలను వేధించడం సరికాదని ఎంపీ, యూబీ గ్రూప్ చైర్మన్ విజయ్ మాల్యా వ్యాఖ్యానించారు. సీపీఐ నేత గురుదాస్ దాస్ గుప్తా మాత్రం ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు.
0 Reviews:
Post a Comment