Contact us

వివాదంలో మాజీ మంత్రి
రామ @ ప్రేమ
* వివాదంలో మాజీ మంత్రి రామదాస్
 * తనను రహస్యంగా పెళ్లి  చేసుకున్నాడంటూ ఓ మహిళ ఆరోపణ
 * మంత్రిగా ఉన్నప్పుడి నుంచే ప్రేమాయణం
 * తనను బహిరంగంగా వివాహం  చేసుకోవాలని డిమాండ్
 * కలత చెందిన రామదాస్ ఆత్మహత్యాయత్నం
 * సకాలంలో ఆస్పత్రికి తరలింపు.. తప్పిన ముప్పు
 * ఆత్మహత్యాయత్నంపై విభిన్న కథనాలు
 
మైసూరు: ఆయన బ్రహ్మచారి. గత బీజేపీ హయాంలో వైద్య విద్యా శాఖ మంత్రిగా పని చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్నారు. ఓ మహిళ హఠాత్తుగా ఆయనపై ‘బాంబు’ లాంటి ఆరోపణలు పేల్చడంతో ఖిన్నుడయ్యారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు.
మాజీ మంత్రి ఎస్‌ఏ. రామదాస్ తనను రహస్యంగా పెళ్లి చేసుకున్నారని చిక్కమగళూరుకు చెందిన ప్రేమ కుమారి (35) మంగళవారం ఇక్కడ ఆరోపించారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్త మరణించాడు. తమకూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో క్లర్కుగా పని చేస్తోంది. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు బదిలీ విషయమై తరచూ వెళ్లానని, క్రమేపీ తమ మధ్య ప్రేమ చిగురించిందని ఆమె వివరించింది.

అందరి సమక్షంలో రామదాస్ తనను వివాహం చేసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ పరిణామాలతో కలత చెందిన రామదాస్ మంగళవారం రాత్రి ఇక్కడి గోకులంలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆయన సహాయకుడు వెంటనే అప్రమత్తమై ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. బెంగళూరుకు తరలించాలని కుటుంబ సభ్యులు యోచిస్తున్నారు. ఆస్పత్రిలో ఆయనను అనేక మంది బీజేపీ నాయకులు పరామర్శించారు. కాగా రామదాస్ ఆత్మహత్యాయత్నంపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి.
 
 మద్దతుదారుని ఆత్మహత్య

 తమ నాయకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలుసుకున్న రామదాస్ మద్దతుదారుడు నవీన్ బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను స్థానిక విద్యారణ్యపురానికి చెందిన వాడు. మరో వైపు ప్రేమ కుమారి బాగోతంపై పలు కథనాలు వినిపిస్తున్నాయి. ఆమె ఇదివరకే ఓ విలేజ్ అకౌంటెంట్‌తో వివాహేతర  సంబంధం కలిగి ఉండేదని, బ్లాంక్ చెక్కు తీసుకుని అతనిని మోసం చేసిందని ఆరోపణలు వెల్లువెత్తాయి.

0 Reviews:

Post a Comment