పాతికేళ్ల కెరీర్... ఏడు నంది అవార్డులు... విభిన్నమైన పాత్రలు... నేటి హీరోల్లో ఒకరిద్దరికి తప్ప మరెవరికీ లేదు ఈ ట్రాక్ రికార్డ్. దటీజ్ జగపతిబాబు. కథానాయకునిగా పాతికేళ్లు కనిపించి, ఇప్పుడు ప్రతినాయకునిగా మారారు. ‘నేను హీరో’నే అని ఫిక్స్ అవకుండా, కాలం మారుతున్న కొద్దీ మారానంటున్నారు. నేడు జగపతిబాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ...
హార్ట్‌ని కాదు.. నోటుని నమ్మాల్సి వస్తోందని గతంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఇప్పుడు మీ మైండ్‌సెట్ ఎలా ఉంది?
నోటుని కాదు.. నోటుని కూడా నమ్మాల్సి వస్తోందంటున్నాను. ఇవాళ నోటి మాటకంటే నోటు మాటలే ఎక్కువయ్యాయి. డబ్బు సంపాదించడం కోసం హద్దులు లేకుండా స్కీములేస్తున్నారు. ఎక్కువ శాతం మంది ఇదే పని మీద ఉంటున్నారు. స్కీములేయడం తెలియనివాళ్లు, అవతలివాడు మోసం చేస్తాడేమో అనే టెన్షన్‌తో బతుకుతున్నాడు. అలా డబ్బు చుట్టూనే అందరి ఆలోచనలు తిరుగుతున్నాయి. రెండడుగులు అటు వెళ్లి ఇటు వచ్చేలోపు ఏం జరుగుతుందో తెలియని జీవితం ఇది. పుట్టుకా, చావూ మన చేతుల్లో ఉండవు. మధ్యలో జీవితం కోసం కొంత పాకులాడాలి. కానీ, పాకులాటే జీవితం కాకూడదు.
‘భవిష్యత్తులో కేరక్టర్ ఆర్టిస్ట్‌గా మారతా’ అని పదేళ్ల క్రితమే అన్నారు. ఇప్పుడా దశలో ఉన్నారు. ఎలా ఉంది?
ఒక్క సినిమా చేస్తే చాలనుకున్నా. వంద సినిమాలు చేశాను. 25ఏళ్లుగా నటుడిగా కొనసాగుతున్నాను. ఏడు నంది అవార్డులు తీసుకున్నాను. బెస్ట్ డెరైక్టర్స్‌తో సినిమాలు చేశాను. కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు వెళ్లిపోవాల్సిందే. దానికి ఫిక్స్ అవ్వాలి. అలా కాకుండా మనకు మనమే గొప్ప అని ఫీలైతే, మన సినిమాని మనమే ఇంట్లో వేసుకుని చూసుకోవాలి. ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా? లేదా అనే టెన్షన్ లేదు. అది హీరో చూసుకుంటాడు. ఓపెనింగ్స్, ఓవరాల్ కలక్షన్స్ గురించీ టెన్షన్ లేదు. నాకైతే స్వేచ్ఛ లభించినట్లుగా ఉంది. హాయిగా నా పారితోషికం నేను తీసుకోవడం, చక్కగా యాక్ట్ చేయడం వరకే నా బాధ్యత ఉంటుంది. అభిమానుల గురించి చెప్పాలి. వాళ్లకి స్వార్థం ఉండదు. నా సినిమా హిట్టయితే అభిమానులకు నేనేం చేస్తాను? మహా అయితే ఎవరైనా కష్టాల్లో ఉంటే హెల్ప్ చేస్తానేమో. కానీ, స్క్రీన్ మీద చూసి, అభిమానించేస్తున్నారు. తెర మీద కనిపించేదంతా అబద్ధమే. అది మా లైఫ్ కాదు. ఆ లైఫ్‌ని ఇష్టపడుతున్నారు. ఇక అంతకంటే ఆస్తి ఏముంటుంది?
ఈ మధ్య ఇల్లు అమ్మేశారట కదా.. ?
ఇల్లు అమ్మిన తర్వాత హాయిగా ఉంది. అప్పులు తీర్చేశాను. నా కుటుంబానికి కావాల్సిన సౌకర్యాలు ఉన్నాయి. పిల్లల పెళ్లి బ్రహ్మాండంగా చేయగలిగే స్థితిలో ఉన్నా. ఇప్పుడు మాత్రం మా సౌకర్యాలకు కొరత లేని ఫ్లాట్ కొనుక్కున్నాను. మళ్లీ బ్రహ్మాండమైన ఇల్లు కడతా. పోగొట్టుకున్నది మళ్లీ సంపాదించుకుంటా.
ఇల్లు అమ్మినప్పుడు బాధ అనిపించలేదా?
పన్నెండేళ్లు ఉన్న ఇల్లు. బాధగానే ఉంటుంది. కానీ, ‘మెటీరియల్’ పోతే కొనుక్కోవచ్చు. ప్రాణాన్ని మాత్రం తెచ్చుకోలేం. అందుకే ‘మరణం’ అంటే భయం.
శ్రీహరి కమిట్ అయిన ‘పిల్లా నీవులేని జీవితం’లోని పాత్ర ఆయన మరణం తర్వాత మీకొచ్చినప్పుడు ఏమనిపించింది?
శ్రీహరి అంటే చాలా ఇష్టం. తను చనిపోయినప్పుడు బాధపడ్డాను. శ్రీహరి కమిట్ అయిన కేరక్టర్‌కి నన్నడిగినప్పుడు ఇబ్బందిపడిపోయాను. ఇది నిజంగా బాధాకరమైన పరిస్థితి. మనం చేయకపోయినా ఎవరో ఒకరు ఆ పాత్ర చేయాల్సిందే కదా అనుకుని, ఒప్పుకున్నాను.
కొత్త ఇల్లు కొనుక్కున్నారు... వాస్తు చూసుకున్నారా?
వాస్తు కన్నా టైమ్‌ని నమ్ముతాను. మన టైమ్ బాగుందనుకోండి మంచి వాస్తు ఉన్న ఇంట్లోకి మారతాం. టైమ్ బాగా లేకపోతే వాస్తు కరెక్ట్‌గా లేని ఇంట్లోనే ఉండిపోతాం. నా టైమ్ బాగున్నప్పుడు ‘మీది గోల్డెన్ లెగ్’ అంటారు. లేనప్పుడు ‘ఐరన్ లెగ్’ అంటారు. కానీ, నా లెగ్‌ని నేనెప్పుడూ మార్చలేదు. మనం పుట్టేదెప్పుడో పోయేదెప్పుడో తెలియదు. మధ్యలోదంతా ఇంటర్వెల్. ఆ పైవాడు మనల్ని ఓ వీడియో గేమ్‌లా ఆడుకుంటున్నాడు.
మరి.. దేవుడు మిమ్మల్ని ఆడించే ఆట మీకెలా అనిపిస్తోంది?
అసలు పుట్టించడం ఎందుకు? ఆడించడం ఎందుకు? అనిపిస్తోంది. కష్టాలొచ్చినప్పుడు గత జన్మ తాలూకు కర్మ అంటారు. గత జన్మ ఏంటి? ఆ కర్మలు ఇప్పుడు అనుభవించడం ఏంటి? నిన్న చేసినదే మర్చిపోతున్నాం. ఇక, గత జన్మ ఇప్పుడు వెంటాడటం ఏంటి? ఆలోచిస్తుంటే వింతగా ఉంది. అలా వస్తాం. ఎప్పుడో ఇలా తీసి అలా పడేస్తాడా దేవుడు. సడన్‌గా ఆ ఆరడుగుల మనిషి మిస్ అవుతాడు. ఎవరైనాసరే ఫైనల్‌గా కలవాల్సింది ఆ మట్టిలోనే.
ఇక, సినిమాల విషయానికొద్దాం.. ఫుల్ బిజీగా ఉన్నట్లున్నారు?
లెజెండ్, పిల్లా నువ్వు లేని జీవితం, రారా కృష్ణయ్య సినిమాల్లో మంచి పాత్రలు చేస్తున్నాను. ఇవి సూపర్ హిట్టయ్యే సినిమాలే. విడుదల తర్వాత ఇంకా మంచి పాత్రలొస్తాయని నమ్మకం. కానీ, రెండు నెలలు బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నా. ఫ్యామిలీతో హాలిడే ప్లాన్ చేసుకున్నాను.
0 Reviews:
Post a Comment