Contact us

7న రాజధానిలో ర్యాలీల భేరీ
హైదరాబాద్, ఆగస్టు 22: సమైక్యాంధ్రకు మద్దతుగా వచ్చే నెల 7న హైదరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహిస్తామని ఎపి ఎన్జీవోలు ప్రకటించిన నేపథ్యంలో అదేరోజు నగరంలోని ఎల్‌బి స్టేడియంలో మిలియన్ మార్చ్- 2ను నిర్వహించడానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఐకాస, తెలంగాణ విద్యార్థి ఐకాస గురువారం సంయుక్తంగా పిలుపునిచ్చాయి. ఒకే రోజు నగరంలో సమైక్యాంధ్ర, ప్రత్యేక తెలంగాణలకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించడానికి ఇరుపక్షాలు సమాయత్తమవుతూ ఉండడంతో ఆ రోజు ఏమి జరుగుతుందోనన్న భయాందోళనలు తలెత్తుతున్నాయి. సెప్టెంబర్ 7న నగరంలోని ఎల్‌బి స్టేడియంలో మిలియన్ మార్చ్-2 జరపడానికి అనుమతి కోసం గురువారం సెంట్రల్ డిసిపిని కలిసి దరఖాస్తు చేసినట్టు ఒయు జెఎసి అధ్యక్షుడు పిడమర్తి రవి, అధికార ప్రతినిధి దూదిమెట్ల బాల్‌రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. మిలియన్ మార్చ్-2ను విజయవంతం చేయాలని తెలంగాణ విద్యార్థిలోకానికి వారు పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర కోసం నందమూరి హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వారు పేర్కొన్నారు. హరికృష్ణ రాజీనామాకు వ్యతిరేకంగా ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను తెలంగాణలో అడ్డుకుంటామని పిడమర్తి రవి, దూదిమెట్ల బాల్‌రాజ్ హెచ్చరించారు. జూనియర్ ఎన్టీఆర్ సమైక్యవాదో, తెలంగాణవాదో స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేసారు.
హైదరాబాద్‌లో సభ జరిపి తీరుతాం
మరో వైపు హైదరాబాద్‌లో సమైక్య సభ నిర్వహించడానికి ఎపిఎన్జీవోలు సిద్ధమవుతున్నారు. సభకు సంబంధించిన అనుమతి కోసం గురువారం ఎన్జివో నేతలు పోలీసు అధికారులను కలిశారు. ఈ సందర్భంగా ఎపిఎన్జీవో అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 7న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సమైక్య సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అలాగే ఈనెల 26 లేదా 27 తేదీల్లో ఢిల్లీకి వెళ్లి సమైక్యాంధ్ర ఆవశ్యకతను గుర్తు చేసేందుకు జాతీయ నాయకులను కలుస్తామని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర సభ నిర్వహించడం తప్పయితే, రాష్ట్ర విభజన కూడా తప్పేనని అశోక్‌బాబు పేర్కొన్నారు. సమైక్యాంధ్రపై కేంద్రం ప్రకటన చేసే వరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో ఆన్‌లైన్‌లో అన్ని రిజిస్ట్రేషన్ సేవలను నిలిపివేయాలని ఆయన కోరారు.
సిఎంతో భేటీ
అంతకు ముందు ఉదయం ఎన్జివో నేతలు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఎపి ఎన్జీవోల సమ్మెపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా హైదరాబాద్‌లో ఎన్జీవోల సభకు ఇప్పటి వరకూ పోలీసు శాఖ నుంచి ఎలాంటి హామీ, అనుమతి లభించలేదు. కాని ఎపిఎన్జీవోలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్‌లో సభ నిర్వహించి తీరుతామని పట్టుదలతో ఉన్నారు.

0 Reviews:

Post a Comment