
నారా లోకేష్ చివరి సారి జులై 22వ తేదీన ట్విట్టర్‌లో చేయి పెట్టారు. ఆ తర్వాత ఆయన పలుకులు వినిపించడం లేదు. రాష్ట్ర విభజనపై రాష్ట్రం రగిలిపోతుంటే ఆయన మౌనముద్ర దాల్చారు. ఆయన తండ్రి చంద్రబాబు రెండు మూడు సార్లు మీడియా ముందుకు వచ్చారు. కానీ, తెలంగాణపై అంతగా స్పందించలేదు. ఆయన కూడా మౌనంగా ఉంటూ వస్తున్నారు. కానీ విభజనను ఆపలేమనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు చెబుతున్నారు.
తెలుగుదేశం పార్టీకి మార్గదర్శకత్వం వహించే భవిష్యత్తు నాయకుడిగా ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్న నారా లోకేష్ ఈ విషయంపై మాట్లాడకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కాంగ్రెసు తీరుపై మండిపడుతూ ఆయన వ్యాఖ్యలు చేస్తారని అనుకుంటే, పూర్తి మౌనముద్ర దాల్చారు. కాగా, చంద్రబాబు తీరుపై సీమాంధ్ర నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతుంటే చేతులు కట్టుకుని కూర్చోవడం తమకు చాలా ఇబ్బందిగా ఉందని వారు అంటున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నారని అంటున్నారు. అయితే, చంద్రబాబు మాత్రం రాష్ట్రం చీలిపోవడం ఖాయమైనట్లు సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు ఇచ్చి, తెలంగాణలో కంటు కావడం ఎందుకని భావిస్తున్నారట.
0 Reviews:
Post a Comment