
హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం లేదా ఉమ్మడిగా రాజధానిగా ప్రకటించాలని షర్మిల అభిప్రాయపడ్డారు. ఉమ్మడి రాజధానిగా పదేళ్లు సరిపోవని చెప్పారు. ఆదాయం పంపిణీ సహా పలు అంశాలు రాష్ట్ర విభజనతో ముడిపడివున్నాయని తెలిపారు. హైదరాబాద్ లోని ఆంధ్రావాసుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం భరోసా ఇవ్వలేదని ఆమె విమర్శించారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా వైఎస్సార్ సీపీ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ మాత్రం గోడ మీద పిల్లివాటం ప్రదర్శిస్తున్నాయని దుయ్యబట్టారు.
రాష్ట్ర విభజన అంశం ఎన్నికలు లేదా రాజకీయాలకు సంబంధం లేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి చెందుతుందని తన తండ్రి వైఎస్సార్ విశ్వసించారని తెలిపారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోలేదన్న దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై మాట్లాడుతూ... ఇది క్విక్ ప్రో కో కాక మరేమిటని నిలదీశారు. తెలంగాణపై కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరిందని ఆమె ఆరోపించారు. నాలుగేళ్ల పాటు సాగదీసి, ఇంత హడావుడిగా తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం హాస్యాస్పదమన్నారు.
తెలంగాణ సెంటిమెంట్ ను తామెల్లప్పుడూ గౌరవిస్తామని షర్మిల చెప్పారు. ఇరు ప్రాంతాల వారికి అన్యాయం జరగకుండా రాష్ట్ర విభజన జరిగితే వ్యతిరేకించబోమని స్పష్టం చేశారు. విభజన విషయంలో తాము అడిగిన అంశాలపై కాంగ్రెస్ వివరణ ఇవ్వలేదని తెలిపారు. కాంగ్రెస్ స్పందిస్తే తామ కూడా స్పందిస్తామన్నారు. ఎవరితోనూ సంప్రదించకుండా కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల వారితో కాంగ్రెస్ చర్చలు జరపాలని షర్మిల సూచించారు.
0 Reviews:
Post a Comment