Contact us

జగన్‌కు పువ్వాడ అజయ్ షాక్
ఖమ్మం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఖమ్మం జిల్లాలో మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం జగన్ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణపై ఇచ్ఛాపురంలో ఆ పార్టీ నాయకురాలు షర్మిల వ్యాఖ్యల పట్ల మనస్తాపానికి గురైన ఆయన రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది.
ఇటీవల తెలంగాణపై జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆ ప్రాంతంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. కాంగ్రెసు పార్టీ విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జరిగిన నేపథ్యంలో సిడబ్ల్యూసి ప్రకటనకు ముందే ఆ పార్టీ సీమాంధ్రకు చెందిన పదహారు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.
దీనిపై అసంతృప్తి చెందిన మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, కెకె మహేందర్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు జిట్టా బాలకృష్ణా రెడ్డి తదితరులు ఇప్పటికే పార్టీని వీడారు. మరికొందరు గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం షర్మిల తన పాదయాత్ర ముగింపు సమయంలో శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తాజాగా పువ్వాడ అజయ్ కుమార్ రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది.

0 Reviews:

Post a Comment