Contact us

ఒక ఐడియా వైకాపా రాజకీయ భవిష్యత్తుని మార్చేస్తుందా?
ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందని వచ్చిన ఒక వ్యాపార ప్రకటన వైకాపాకు అక్షరాల వర్తిస్తుందనిపిస్తుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో తన పార్టీ భవిష్యత్తుని పణంగా పెట్టి, సమైక్యాంధ్ర కోసం మొదలుపెట్టిన పోరాటం చాలా సాహసోపేతమయిన నిర్ణయమని చెప్పక తప్పదు. దానివల్ల ఆ పార్టీ ఇక తెలంగాణాలో అడుగుపెట్టే అవకాశం పూర్తిగా కోల్పోయినా, సీమాంధ్ర ప్రాంతంలో మాత్రం ఊహించిన దానికంటే చాలా మంచి ఫలితాలను రాబట్టగలిగింది. ఆ ఐడియా సీమంధ్రలో వైకాపా రాజకీయ రేటింగ్స్ లో చాలా మార్పు తీసుకువచ్చింది.


రాష్ట్ర విభజన ఖాయమని తెలిసి కూడా వైకాపా తన సమైక్య ఉద్యమాలను తీవ్ర స్థాయిలో కొనసాగిస్తూనే ఉంది. కేవలం సీమాంధ్ర ప్రాంతానికే పరిమితమయ్యేందుకు సిద్దపడిన వైకాపా, ఆంద్ర, తెలంగాణా ప్రాంతాలలో పార్టీని నిలుపుకోవాలనే తెదేపా, కాంగ్రెస్ పార్టీల బలహీనతపై ఆడుకొంటుంటే, ఆ రెండు పార్టీలు దానిని ఏవిధంగా నిలువరించాలో తెలియక అయోమయంలోపడ్డాయి. దానితో ఆ రెండు పార్టీలకు చెందిన నేతలు ఒక ప్రజాకర్షక నిర్ణయంతో ముందుకు సాగుతున్న వైకాపా వైపు ఆకర్షితులవుతున్నారు.

వైకాపా మొదలుపెట్టిన ఈ సమైక్య ఉద్యమ వ్యూహాన్నిఏవిధంగా ఎదుర్కోవాలో తెలియక అవస్థ పడుతున్న తెదేపా, కాంగ్రెస్ పార్టీలకి, ఇప్పుడు తమ నేతలు వైకాపా వైపు ఆకర్షితులవకుండా నిలుపుకోవడం కూడా మరో పెద్ద సమస్యగా మారింది.

రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం, విద్యుత్ చార్జీల పెంపుపై విజయమ్మ ఆమరణ నిరాహరణ దీక్షల సందర్భంగా పూర్తిగా అడుగంటిపోయున్న వైకాపా రాజకీయ రేటింగ్, ఇప్పుడు సమైక్య ఉద్యమాలతో మళ్ళీ పతాక స్థాయికి చేరిందని చెప్పవచ్చును. సమైక్యాంధ్ర మిషతో  ఆ పార్టీలో జేరెందుకు అవకాశవాద రాజకీయ నాయకులు బారులు తీరడమే ఇందుకు చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చును.

తెదేపా సీనియర్ నేత తమ్మినేని సీతారాం, కాటసాని రామిరెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తదితరులు వైకాపా తీర్ధం పుచ్చుకొంటున్నారు. ఇక, నందమూరి హరికృష్ణ కూడా అకస్మాతుగా సమైక్య నినాదం అందుకోవడం చూస్తే, అతను కూడా నేడో రేపో వైకాపా కండువా కప్పుకొన్నాఆశ్చర్యం లేదు. వీరందరూ సమైక్యాంధ్ర కోసమే వైకాపాలో జేరుతున్నట్లు చెప్పుకొంటున్నపట్టికీ, తమ రాజకీయ భవిష్యత్తుని, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికే జేరుతున్నారనేది కాదనలేని సత్యం. ఒకవేళ ఎన్నికల సమయానికి పరిస్థితులు తారుమారయి తెదేపా కాంగ్రెస్ పార్టీలు మళ్ళీ బలపడినట్లయితే వారు తిరిగి స్వంత గూటికి చేరుకోవడం ఖాయం.

మరి ఇటువంటి అవకాశావాదులయిన రాజకీయ నేతలను ఆకర్షించడం ద్వారా వైకాపా తన రాజకీయ రేటింగ్స్ పెంచుకోవచ్చునేమో కానీ, అది ఆ పార్టీకి ఎంతవరకు మేలు చేస్తుందో వారికే తెలియాలి. జగన్ మోహన్ రెడ్డి అరస్టయిన నాటి నుండి నాయకత్వ లోపంతో బాధపడుతున్న వైకాపా తన మనుగడ కోసం ఇటువంటి తాత్కాలిక ఉపాయాలు ఆలోచించడం సహజమే అయినప్పటికీ, పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అందుకు తగిన వ్యూహాలు అమలుచేయడం మేలు.

teluguone

0 Reviews:

Post a Comment