Contact us

సంకటంలో అధిష్ఠానం
 
హైదరాబాద్, ఆగస్ట్ 8 : 'రాష్ట్ర విభజన వల్ల తలెత్తబోయే సమస్యలకు ముందు జవాబు చెప్పండి. ఆ తర్వాతే ముందుకు కదలండి'... అంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అడ్డం తిరగడంతో కాంగ్రెస్ అధిష్ఠానం సంకట స్థితిలో పడింది. తదుపరి ప్రక్రియను ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న దానిపై అయోమయంలో మునిగింది. సార్వత్రిక ఎన్నికలకు ముందే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ముగించి, రాజకీయంగా ఎంతోకొంత లబ్ధి పొందాలన్న అధిష్ఠానం ఎత్తుగడ దీంతో సందిగ్ధంలో పడింది. రాష్ట్ర విభజన మంచిది కాదని తేల్చి చెప్పడమే కాకుండా, అసెంబ్లీలోనూ పూర్తిస్థాయి చర్చ జరగాలంటూ కిరణ్ మెలిక పెట్టడంతో, విభజన ప్రక్రియకు ఆయన సహకరించరన్న విషయం స్పష్టమైంది.

తెలంగాణ ఏర్పాటుపై వైఖరిని విస్పష్టం చేయడం ద్వారా కిరణ్... తనను పదవి నుంచి తొలగించడమా? లేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అపడమా? తేల్చుకోవాల్సిన అగత్యాన్ని అధిష్ఠానానికి కల్పించారు. మంత్రులు పలువురు రాజీనామాలు చేసినప్పటికీ, వాటిని ఆమోదించకపోవడం, పైగా కిరణ్ పదవిలో ఉండడం వల్ల ఇప్పటిదాకా రాష్ట్రంలో, నామమాత్రంగానైనా ప్రజా ప్రభుత్వం ఒకటి ఉందన్న అభిప్రాయం నెలకొంది. ఇప్పుడు కిరణ్‌తో రాజీనామా చేయిస్తే, కేబినెట్ రద్దవుతుంది. సీమాంధ్ర నుంచి మరొక నేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే పరిస్థితి ఎంతమాత్రం లేదు. ఒకవేళ తెలంగాణ నేతల్లో ఎవరో ఒకరిని ముఖ్యమంత్రిగా నియమించినా, సీమాంధ్ర నుంచి ఏ ఒక్కరూ మంత్రి మండలిలో చేరే అవకాశం లేదు.

అంటే రాష్ట్రంలో అసలు ప్రజా ప్రభుత్వమే లేని స్థితి ఏర్పడొచ్చు. లేదా సీమాంధ్రకు ప్రాతినిధ్యమే లేని ప్రభుత్వమైనా ఏర్పడొచ్చు. ఇలాంటి ఏకపక్ష వాతావరణంలో కేంద్రం, లేదా కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్ర విభజన ప్రక్రియను ఎంతవరకు ముందుకు తీసుకువెళ్లగలుగుతుందనేది అసలు ప్రశ్న. సీఎం కిరణ్‌ను దారికి తెచ్చుకోవడం, కాదంటే రాజీనామా చేయించి రాష్ట్రపతి పాలన విధించడం, అందుకు నిరాకరిస్తే ఆయనను బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించి విభజనకు ముందుకెళ్లడం... ఢిల్లీ పెద్దల ముందున్న మార్గాలు.

ఇందులో మొదటిది దాదాపు అసాధ్యమని తేలిపోయింది. ఇక మిగతా రెండింటిలో ఏది చేసినా, సొంత పార్టీ ముఖ్యమంత్రి అభిప్రాయాన్నే పట్టించుకోకుండా, పార్టీ ప్రభుత్వాన్నే కూల్చివేసి, రాష్ట్రాన్ని విభజించిన అపఖ్యాతి తప్పదు. ఇప్పటికే రగులుతున్న సీమాంధ్ర ప్రజలు కాంగ్రెస్‌పై మరింత భగ్గుమంటారు. ఆ ప్రాంతంలో కిరణ్ ఒక హీరోగా మారిపోయే అవకాశం ఉంది. ఒకవేళ అందుకూ సిద్ధపడి మొండిగా ముందుకే వెళ్లాలని అధిష్ఠానం నిర్ణయించుకున్నా... విభజన ప్రక్రియకు రాజ్యాంగపరంగా, రాజకీయంగా, న్యాయపరంగా ఎంతవరకు ఆమోదయోగ్యత లభిస్తుందనేది అసలు సందేహం. దేశ చరిత్రలో ఇదొక చెడు సంప్రదాయంగా, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమైన చర్యగా కూడా మిగిలే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి ఎంతో కొంత రాజీపడి కిరణ్‌నే ముఖ్యమంత్రిగా కొనసాగించాలనుకున్నా కూడా హైకమాండ్‌కు ఇబ్బందులు తప్పేలా లేవు.

విభజనకు తాను వ్యతిరేకమని కిరణ్ బహిరంగంగానే స్పష్టం చేయడంతో... తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయన నాయకత్వాన్ని ఎంతమాత్రం ఆమోదించకపోవచ్చు. ప్రస్తుత పరిస్థితిని టీఆర్ఎస్ తనకు అనుకూలంగా మలచుకునే అవకాశమున్న నేపథ్యంలో తెలంగాణ నేతలు సైతం ధిక్కార మార్గాన్ని ఎంచుకోవచ్చు. మొత్తంమీద కాంగ్రెస్ హైకమాండ్ పరిస్థితి ముందునుయ్యి వెనక గొయ్యిలా మారింది. అధిష్ఠానం నిర్ణయాన్ని తప్పుబడుతూ... సీఎం కిరణ్.. 'వాళ్లు, వీళ్లు' అని సంబోధిస్తూ.. తాను వేరు... ఢిల్లీ నేతలు వేరు అన్నట్టుగా మాట్లాడడాన్ని కూడా పార్టీ నాయకులు గమనించారు. "ఈ ధిక్కారాన్ని కాంగ్రెస్ సహించదు. రేపోమాపో ఆయన రాజీనామా చేయాల్సిందే. ఆయన దిగకపోతే... అధిష్ఠానమే తప్పించినా తప్పిస్తుంది'' అని తెలంగాణ నేతలు భావిస్తున్నారు.

కేంద్రంలోనూ ఇబ్బందే
'సీఎం పదవి నాకు ముఖ్యం కాదు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం' అనే వాదన ద్వారా సీమాంధ్రలో హీరోగా మిగిలేపోయేలా కిరణ్ వేసిన ఎత్తుగడతో... కేంద్ర ప్రభుత్వానికీ ఇబ్బందులు కలిగించనుంది. కిరణ్ వైఖరితో సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలపైనా ఒత్తిడి పెరగడం తథ్యం. ఇప్పటికే సమైక్య ఉద్యమకారులు మంత్రులు, ఎంపీల రాజీనామాల కోసం పట్టుబడుతున్నారు. అత్యంత కీలకమైన, ప్రతిష్ఠాత్మకమైన ఆహార భద్రత బిల్లు సభ ముందుకు వస్తున్న ఈ తరుణంలో... కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తే.. యూపీఏ ప్రభుత్వ పార్లమెంటు ఎజెండానే గందరగోళంలో పడుతుంది. బిల్లుల సంగతి తర్వాత.. ముందు మీ ప్రభుత్వంలో సంక్షోభం సంగతి తేల్చండి అని విపక్షాలు యూపీఏను ఇరకాటంలోకి నెట్టవచ్చు.

సోమ, మంగళవారాల్లో ఆహార భద్రత బిల్లుపై పార్లమెంట్ ఉభయ సభల్లో ఓటింగ్ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ ఎంపీల మద్దతు అత్యవసరం. దీన్ని గమనించే అదును చూసి కిరణ్ 'బ్రహ్మాస్త్రాన్ని' ప్రయోగించినట్టు భావిస్తున్నారు. తద్వారా సోనియాకు ప్రతిష్ఠాత్మకమైన ఆహార భద్రత బిల్లును, రాష్ట్ర విభజనపై బేరసారాలకు వినియోగించుకోవాలని ఎత్తువేసినట్టు తెలిసింది.

source:andhra jyothy
 

0 Reviews:

Post a Comment