Contact us

పట్టాలెక్కితే జైలే
 
హైదరాబాద్, ఆగస్టు 8 : రైలు పట్టాలెక్కితే నాన్‌బెయిలబుల్ కేసులు పెడతామని రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి హెచ్చరించారు. రైళ్లను అడ్డుకోవడం, రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం వంటివి చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో గురువారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్రలో సమైక్య ఉద్యమకారులు రైల్‌రోకోలపై పునరాలోచించుకోవాలన్నారు. గతంలో తెలంగాణలో రైల్‌రోకోలు చేసినప్పుడు కాసేపు పట్టాలపైకి వచ్చి ఫొటో దిగుతామంటే సహకరించామని, అలా కాకుండా సమైక్యవాదులు గుజ్జర్ల తరహాలో పట్టాలెక్కుతామంటే పోలీసులు కచ్చితంగా అడ్డుకుంటారని హెచ్చరించారు.

పట్టాలపైకి కోటిమంది వస్తామని తెలంగాణలో పిలుపు ఇచ్చినప్పుడు తాము నాన్‌బెయిలబుల్ కేసులు పెడతామంటే లైట్ తీసుకున్నవారు ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని గుర్తుచేశారు. రైల్వేట్రాక్‌పై నిఘా కెమెరాలు ఏర్పాటు చేశామని, హెలికాప్టర్ ద్వారా గగనతలం నుంచి గస్తీ నిర్వహిస్తామని తెలిపారు. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా పోలీసులు చూస్తూ ఊరుకోబోరన్నారు. రైల్‌రోకోలకు ఎట్టిపరిస్థితుల్లో అనుమతిలేదని, వాటిని వెంటనే విరమించుకోవాలని డీజీపీ కోరారు. హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోలు కార్యాలయ ప్రాంగణంలో ఆందోళనలు చేయవద్దని, అది హింసకు దారితీసే అవకాశం ఉన్నందున మార్చుకోవాలని సూచించారు.

జాతీయ నాయకుల విగ్రహాలు ధ్వంసం చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. 'ఒక పెద్దమనిషి నా గురించి మాట్లాడుతున్నారు, నేను అంతకన్నా బాగా మాట్లాడగలను... టైం వేస్ట్ అని మాట్లాడటంలేదు' అని స్పందించారు. కొన్ని టీవీ చానళ్లు పోలీసులపై బురద జల్లుతున్నాయని, తమని అశక్తులుగా చిత్రీకరిస్తే ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందన్నారు. ఒక టీవీ చానెల్(ఏబీఎన్‌కాదు) "తెలంగాణలో వివక్ష, సీమాంధ్రలో ప్రేక్షకపాత్ర'' అని పోలీసులను చిత్రిస్తూ ప్రసారాలు చేయడం సరికాదన్నారు. వారితో నేరుగా మాట్లాడితే టీఆర్‌పీ కోసం, యాజమాన్య ఆలోచనల మేరకు అలా వేశామని సమాధానం వచ్చిందన్నారు.

ఓయూలో ఎలాంటి ఆంక్షలు విధించామో ఎస్‌కేలోనూ అలాంటి ఆంక్షలే విధించామని, సీమాంధ్ర జిల్లాల్లో పనిచేసే పోలీసు అధికారుల్లో తెలంగాణ వారు కూడా ఉన్నారని వివరించారు. సమైక్య ఉద్యమంలో హింసకు తావులేనందున పోలీసులు కఠినంగా వ్యవహరించడం లేదన్నారు. అలాగాక వారిక్కడికొచ్చి అసెంబ్లీని ముట్టడిస్తామంటే కచ్చితంగా అడ్డుకుంటామని దినేష్‌రెడ్డి స్పష్టం చేశారు.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు భద్రత పెంచాలని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారని, సుపారీకి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పారు. పోలీసులు భద్రత పెంచి దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డీజీలు కౌముది, మహేందర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, సిటీ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ, ఏపీఎస్పీ చీఫ్ గౌతం సవాంగ్, ఐజీ హరీశ్ కుమార్ గుప్తా పాల్గొన్నారు.
andhrajyothy

0 Reviews:

Post a Comment