హైదరాబాద్, ఆగస్టు 8 : కొత్తగా ఏర్పడే తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాల్లో బీజేపీయే కీలక శక్తిగా ఎదగనుందని, కాంగ్రెస్‌కు సరైన ప్రత్యామ్నాయం కాబోతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో పాగా వేసే పార్టీ తమదేనని, దాంతో రెండు రాష్ట్రాలను సమాంతరంగా, సమర్థవంతంగా అభివృద్ధి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. కరీంనగర్ జిల్లా కోరుట్ల నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి భూమారావు, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ ఆకుల సత్యనారాయణ, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొప్పిశెట్టి సత్యనారాయణ తదితరులు, రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజవర్గానికి చెందిన తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి సునీల్ చౌదరి, ఆయన అనుచరులు గురువారం బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. తమ పార్టీ ఇతర పార్టీల మాదిరిగా ఏ ఎండకా గొడుగు పట్టదని, ఏ పూటకా మాట మాట్లాడదని చెప్పారు. మాట మీద నిలబడే పార్టీ అని, ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయానికే పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కట్టుబడి ఉండడం లేదని ఆరోపించారు. అలాంటి చేతగాని, దద్దమ్మ కాంగ్రెస్ వల్లే రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
స్వార్థపూరిత, విషభావాజాలం ఉన్న పార్టీ కాబట్టే కాంగ్రెస్‌పై ప్రజల్లో నిరసన భావం పెరిగిపోతుందని, బీజేపీకి ఆదరణ పెరుగుతోందని చెప్పారు. నరేంద్ర మోదీ ప్రభంజనంతో కాంగ్రెస్ పార్టీ దేశంలో, రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. 2014 ఎన్నికల్లా బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతుందని, తెలంగాణ, సీమాంధ్రలో తమ పార్టీయే కీలకం కానుందని చెప్పారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ పార్టీగా ఆవిర్భవిస్తుందని చెప్పారు. మోదీ ప్రభంజనంతో కేంద్రంలో అధికారంలోకి వస్తామని, అప్పుడు తెలంగాణ, సీమాంధ్రలను సమాంతరంగా, అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు.
కాగా.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకునే పార్టీ బీజేపీ ఒక్కటేనని మరో సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్‌రావు చెప్పారు. అందుకే 1999లోనే రాయలసీమకు గోదావరి నది నుంచి 200 టీఎంసీల నీటిని ఇవ్వాలంటూ బీజేపీ తీర్మానించిందని చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్నవారందరినీ భారతీయులుగానే బీజేపీ గుర్తిస్తుందని కె.లక్ష్మణ్ చెప్పారు. తెలంగాణ ప్రకటన వెలువడిన తర్వాత సీఎం కిరణ్ కనిపించకుండా పోయారని బండారు దత్తాత్రేయ ఎద్దేవా చేశారు.
andhrajyothy
0 Reviews:
Post a Comment