
తన తెగకు కాకుండా వేరే ఊరికి చెందిన వ్యక్తిపై మనసు పడటమే ఆమె చేసిన నేరం! ఆ 'పాపానికి' ఊరి పెద్దలు విధించిన జరిమానా కట్టలేకపోవడం ఆమె దురదృష్టం!! ఫలితం.. ఊళ్లో ఉన్న మగాళ్లంతా ఆమెపై అత్యాచారం చేయాలంటూ ఖాప్ పంచాయతీ ఆదేశించింది! 13 మంది దుర్మార్గులు.. దాన్ని పాటించారు.. పదేపదే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. పశ్చిమబెంగాల్‌లో మంగళవారం రాత్రి జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కోల్‌కతా, జనవరి 23: ప్రేమించిన పాపానికి ఒక గిరిజన మహిళపై సామూహిక అత్యాచార కాండకు తీర్పునిచ్చారో తెగపెద్దలు!! పశ్చిమబెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లా లభ్‌పూర్‌లో మంగళవారం రాత్రి జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. లభ్‌పూర్‌కు చెందిన ఒక గిరిజన మహిళ.. సమీప గ్రామానికి చెందిన ఒక గిరిజనేతర వ్యక్తిని ప్రేమించింది. ఈ విషయం సోమవారం బయటపడటంతో గ్రామపెద్దలు ఖాప్ పంచాయతీ పెట్టారు. ఆమెను, ఆమె ప్రియుడిని కట్టేసి విచారణ (?) జరిపారు. రూ.25వేల జరిమానా విధించి.. ఆ సొమ్ము కట్టలేకపోవడంతో ఆ అభాగ్యురాలిపై సామూహిక అత్యాచార కాండ సాగించాల్సిందిగా తీర్పునిచ్చారు! అంతే.. ఆమెపై 13 మంది గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. రాత్రంతా ఆమెపై పదేపదే అత్యాచారం చేశారు.
మర్నాడు తెల్లవారుజామున ఆమె ఇంటి ముందు పడేసి.. ఈ విషయం పోలీసులకు చెప్తే చంపేస్తామంటూ ఆమె తల్లిదండ్రులను హెచ్చరించి వెళ్లిపోయారు. తీవ్రరక్తస్రావంతో గుమ్మం ముందు పడి ఉన్న కూతుర్ని చూసి ఆ తల్లిదండ్రులు కుమిలిపోయారు. జాగ్రత్తగా ఆమెను లోపలికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేశారు. రక్తస్రావం ఆగకపోవడంతో దగ్గర్లో ఉన్న ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు బోల్పూర్ సబ్ డివిజనల్ ఆస్పత్రికి.. అక్కడి నుంచి సూరి ఆస్పత్రికి ఆమెను తరలించారు. ప్రస్తుతం ఆమె సూరి ఆస్పత్రిలో ఐదుగురు వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. బుధవారం మధ్యాహ్నానికి బాధిత మహిళ తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. కాగా.. జరిగిన ఘోరంతో తీవ్ర షాక్‌కు గురైన బాధితురాలు బాధను దిగమింగుకుంటూ తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పింది.
"ఉళ్లో ఉన్న మగాళ్లంతా నన్ను అనుభవించాలని గ్రామ పెద్ద తీర్పునిచ్చారు. అంతే.. కనీసం 13 మంది, అందులో కొందరు ఒకే కుటుంబానికి చెందినవారు కూడా ఉన్నారు. వారిలో కొందరు నా తండ్రివయసు వారూ ఉన్నారు. వారంతా నన్ను పదేపదే రేప్ చేశారు. వాళ్లు నాపై ఎన్నిసార్లు అత్యాచారం చేశారో కూడా నాకు తెలియదు'' అని హృదయవిదారకంగా రోదిస్తోందామె. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘోరంపై స్పందించిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బీర్‌భూమ్ జిల్లా ఎస్పీ సి.సుధాకర్ తొలగింపునకు ఆదేశాలు జరీ చేశారు. డార్జిలింగ్ ఎస్పీ కునాల్ అగర్వాల్‌కు బీర్‌భూమ్ జిల్లా బాధ్యతలు అప్పగించారు. ఇక.. ఈ దురాగతానికి పాల్పడ్డ పదమూడు మందినీ అరెస్ట్ చేసినట్టు ఆ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి శశిపంజా తెలిపారు. ఆమె తన ఇంటికి వెళ్లాలనుకుంటే పంపించి, భద్రతా ఏర్పాట్లు చేస్తామని.. ఒకవేళ ఆమె వెళ్లనంటే తగిన వైద్యసహాయం అందిస్తామని వివరించారు.
కాగా, నిందితుల బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన బోల్పూర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ పీయూష్ ఘోష్.. వారికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అత్యాచారం చేసినవారితో పాటు.. బాధితురాలు ప్రేమించిన వ్యక్తిని కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పంచాయతీ పెద్దల ఆదేశంతో జరిగిన ఈ ఘోరంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అన్ని రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు దీనిపై మండిపడ్డాయి. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎం.కె.నారాయణన్.. నిందితులందరికీ దేహ దండన శిక్ష విధించాలంటూ నిప్పులు చెరిగారు. ఈ ఘటన పూర్తిగా అమానవీయం, దారుణం అని కేంద్ర మంత్రి మనీష్ తివారీ అన్నారు. నిందితులకు అత్యంత కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
ఇక.. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, ఎంపీ ముకుల్ రాయ్ ఒక ప్రకటన చేశారు. ఈ దారుణంపై స్పందించిన పశ్చిమబెంగాల్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునందా గోస్వామి కేసును సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించనున్నామన్నారు. ఇంత దారుణానికి వేదికైన లభ్‌పూర్ గ్రామవాసులు మాత్రం తమ గ్రామంలో అలాంటిదేమీ జరగలేదని చెబుతున్నారు.
0 Reviews:
Post a Comment