ఆయన ఆస్కార్‌కు అర్హుడు
సోనియాతో ఒప్పందం ప్రకారమే అసెంబ్లీలో డ్రామాలు
విభజన కోసం గుంటనక్కలా ఎదురుచూపులు: ధూళిపాళ
'సమైక్య' అర్హత జగన్‌కు లేదు: ముద్దు
సోనియాతో ఒప్పందం ప్రకారమే అసెంబ్లీలో డ్రామాలు
విభజన కోసం గుంటనక్కలా ఎదురుచూపులు: ధూళిపాళ
'సమైక్య' అర్హత జగన్‌కు లేదు: ముద్దు
హైదరాబాద్/పుత్తూరు, జనవరి 26: వైసీపీ అధ్యక్షుడు జగన్.. సమైక్య ముసుగులో నాటకాలు ఆడుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నేతలు విరుచుకుపడ్డారు. కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నారని మండిపడ్డారు. సమైసమైక్యవాదాన్ని వినిపించకుండా రోజూ సభకు వచ్చి వెళుతున్న వైసీపీ ఎమ్మెల్యేల జగన్నాటకానికి సోమవారం తెరపడుతుందని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. టీడీఎల్‌పీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సోనియాతో కుదుర్చుకున్న రహస్య ఒప్పందం మేరకు వైసీపీ ఎమ్మెల్యేలతో నాటకాలాడిస్తున్న జగన్ ఆస్కార్ అవార్డుకు అర్హుడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసు, రూల్-77కింద టీడీపీ ఇచ్చిన తీర్మానం మేరకు సోమవారం సభలో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయని చెప్పారు. బిల్లును ఎలా తిప్పిపంపాలని తాము ఆలోచిస్తుంటే రాష్ట్ర విభజన ఖాయమంటూ పార్టీ శ్రేణులకు జగన్ సంకేతాలివ్వడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు.
సోనియా, కాంగ్రెస్ హై కమాండ్‌తో చేసుకున్న చీకటి ఒప్పందంలో భాగంగా ప్రతిరోజూ ఉదయాన్నే ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపడం, మార్నింగ్ షో అయిపోగానే ఇంటికెళ్లి పడుకోవడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. విభజన ఎంత తొందరగా జరుగుతుందా? అని గుంటనక్కలా ఎదురుచూస్తున్న జగన్ బండారం సోమవారం సభలో బయటపడుతుందన్నారు. కాగా, రాష్ట్రంలో విభజన చిచ్చుపెట్టింది తన తండ్రేనని తెలిసీ.. ఇడుపులపాయలో ఆర్టికల్ 3 గురించి ప్రకటన చేసిన జగన్‌కు.. ఇప్పుడు సమైక్యాంధ్ర కోసం పాటు పడుతున్న చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడి, జైలు పాలై బెయిల్ కోసం సోనియా కాళ్ల వద్ద మోకరిల్లిన జగన్.. సమైక్యాంధ్ర గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. విభజనపై కేంద్రం పంపిన బిల్లును అసెంబ్లీలో చర్చిస్తే వీగిపోయేదని అభిప్రాయపడ్డారు. అలాంటి కీలక చర్చలో వైసీపీ ఎమ్మెల్యేలు పాల్గొనకుండా వాకౌట్ చేయడం వెనుక ఆంతర్యమేమిటన్నది జగన్, విజయమ్మ చెప్పాలని డిమాండు చేశారు.
0 Reviews:
Post a Comment