Contact us

ఆ పార్టీ తీవ్ర సంక్షోంభంలో పడిందా?
వైఎస్సార్‌ కాంగ్రెసు పార్టీలో ఏం జరుగుతోంది? ఆ పార్టీ తీవ్ర సంక్షోంభంలో పడిందా? జగన్‌ నియంతలా వ్యవహరిస్తూ పార్టీని సర్వనాశనం చేస్తున్నాడా? వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి దిశగా పయనించే అవకాశముందా? కుటుంబ సభ్యల మధ్యనే తీవ్ర విభేదాలున్నాయా? రాజకీయంగా వైఎస్‌ జగన్‌ పతనం వైపు ప్రయాణిస్తునాడా?...ఇలాంటి అనేకానేక ప్రశ్నలు  చర్చనీయాంశమయ్యాయి. ఇందుకు కారణం జగన్‌ వ్యతిరేక మీడియాలో ప్రతిరోజూ వస్తున్న కథనాలే. జగన్‌ను తీవ్రంగా వ్యతిరేకించే ఆ రెండు పత్రికల్లో ఒకటి కొన్ని రోజులుగా జగన్‌ పని అయిపోయిందంటూ కథనాలు ప్రచురిస్తోంది. జగన్‌ గ్రాఫ్‌ పడిపోయిందని ఘంటాపథంగా చెబుతోంది. రాష్ట్ర విభజనకు మీరు కారణమంటే మీరు కారణమని మీడియాలో దుమ్మెత్తి పోసుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైఎస్‌ జగన్‌  ఒకరినొకరు అణగదొక్కుకోవడానికి ముమ్మరంగా కృషి చేస్తున్నారు.  కాంగ్రెసు-వైకాపా కుమ్మక్కయ్యాయని టీడీపీ ఆరోపిస్తుంటే, కాంగ్రెసు-టీడీపీ కలిసి కుట్రలు చేస్తున్నాయని వైకాపా శాపనార్థాలు పెడుతోంది. జోరుగా మైండ్‌గేమ్‌ ఆడుతున్నాయి. ఇందులో భాగంగా జగన్‌ పార్టీ పని అయిపోయిందని ఆయన వ్యతిరేక మీడియా జోరుగా ప్రచారం చేస్తోంది. ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనేది వచ్చే ఎన్నికల్లో తేలుతుంది. 
వ్యతిరేక ప్రచారం తీవ్రం
సాక్షిలోనూ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎక్కువ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే చంద్రబాబు, టీడీపీలపై సాక్షిలో వస్తున్న కథనాలకంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియాలో వస్తున్న కథనాలు చాలా వాడిగా వేడిగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో జగన్‌ పార్టీ బతికి బట్ట కట్టడం కష్టమనే భావన కలిగిస్తున్నాయి. జగన్‌ వ్యతిరేక మీడియాలో వస్తున్న కథనాల్లో ఒక ప్రధానాంశం అతను నియంతలా వ్యవహరిస్తుండటంతో అనేకమంది నేతలు పార్టీ నుంచి వెళ్లిపోవడానికి ప్లాన్‌ చేస్తున్నారని, మరోటి జగన్‌కు తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతోనే తీవ్ర విభేదాలున్నాయని. షర్మిలకు, జగన్‌కు పడటంలేదని, జగన్‌ ఆమెను పక్కకు పెట్టాడని తీవ్రంగా ప్రచారం జరిగింది. తాజాగా విజయమ్మకు, జగన్‌కు మధ్య కూడా విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చ సందర్భంగా విజయమ్మ సరిగా మాట్లాడలేదని, అది పార్టీకి మైనస్‌ అయిందంటూ జగన్‌ మండిపడినట్లు, దీంతో విజయమ్మ తీవ్రంగా బాధపడి పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు రేగిందనే ప్రచారం మాత్రం తీవ్రంగా ఉంది. జగన్‌కు, షర్మిలకు పడటంలేదనే ప్రచారం చాలా కాలం సాగినా దాన్ని తల్లీ కూతుళ్లు ఖండించే ప్రయత్నం చేయలేదు. 
షర్మిలతో బెడిసిందా?
సుదీర్ఘ పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించిన షర్మిల తన అన్నయ్య బెయిల్‌పై జైలు నుంచి బయటకు రాగానే కనుమరుగైపోయింది. అప్పటి నుంచి ఇప్పటివవరకు ఏమీ మాట్లాడటంలేదు. ఇదంతా కడప లోక్‌సభ సీటుపై రగిలిన చిచ్చు అని, షర్మిల ఆ సీటు కోరుకుంటే జగన్‌ కాదన్నాడని, దాన్ని తన బాబాయి కుమారుడైన అవినాష్‌కు ఇచ్చాడని కథనాలు వచ్చాయి. ఈ ‘చిచ్చు’ ప్రచారం తీవ్రం కావడంతో కొన్ని రోజుల క్రితం ‘సాక్షి’ టీవీ షర్మిలను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. ఈ ప్రచారంలో నిజం లేదని, అన్న  జైల్లో ఉండటంతో పార్టీ మనుగడ కోసం తాను పాదయాత్ర చేశానని, అదీ జగన్‌ సూచన మేరకే జరిగిందని, అతను జైలు నుంచి రావడంతో అక్కడితో తన పాత్ర ముగిసిపోయిందని షర్మిల చెప్పింది. పార్టీని జగన్‌ చూసుకుంటున్నప్పడు తాను ఇన్‌వాల్వ్‌ అయితే అది అనవసర జోక్యం అవుతుందని చెప్పింది. పార్టీకి అవసరమైనప్పుడు మళ్లీ తాను రంగంలోకి వస్తానని, తాను ఎప్పటికీ జగనన్న బాణాన్నే అని స్పష్టం చేసింది. కడప సీటుపై వివాదం లేదని, వ్యక్తిగతంగా తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని వివరించింది. 
జగన్‌ సర్వేలోనే తగ్గిన బలం!
ఇక తాజాగా వైకాపా దళిత నేత, మాజీ మంత్రి మారెప్ప జగన్‌పై తీవ్రంగా విరుచుకుపడటంతో ‘జగన్‌ పార్టీలో చిచ్చు’ ప్రచారానికి మరింత ఊతం లభించింది. ఒకప్పుడు జగన్‌కు అండగా ఉన్నవారంతా తప్పుకుంటున్నారని, కొందరు ఎన్నికల్లో పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్నారని, వైకాపా తరపున నిలబడితే ఓటమి తప్పదనే భావనలో ఉన్నారని వార్తలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలో జగన్‌ బలం సగానికి పడిపోయిందని, ఇది ఆయన చేయించిన సర్వేలోనే తేలిందని ‘ఆంధ్రజ్యోతి’ తాజాగా కథనం ప్రచురించింది. జగన్‌ సమన్యాయం నుంచి సమైక్య టర్న్‌ తీసుకున్న తరువాత తెలంగాణలో పార్టీ అధోగతి పాలైన విషయం వాస్తవమే. అయితే ఇప్పుడు సీమాంధ్రలో సైతం వైకాపాకు బలం లేదని సర్వేలో తేలినట్లు ఆ కథనం వివరించింది. జిల్లాలవారీగా, సంవత్సరాలవారీగా వైకాపా బలం ఎలా తగ్గిపోయిందో శాతాలతో సహా వివరించింది. ఈ టేబుల్‌ చూసినవారెవరికైనా వైకాపా పని అయిపోయిందనే అభిప్రాయం కలుగుతుంది.
బంధువులే కాకుండా, వైకాపా ఏర్పాటు సమయం నుంచి తోడుగా ఉన్న అనేకమంది నాయకులు జగన్‌ నియంతృత్వాన్ని తట్టుకోలేకపోతున్నారని, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతాడనే ప్రచారం ఉంది. చివరకు సీనియర్‌ నాయకుడు, ఒకప్పుడు వైఎస్‌కు సన్నిహితుడైన ఎంవి మైసూరారెడ్డి సైతం జగన్‌ ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిరావడంతో తీవ్రంగా ఆవేదన చెందుతున్నాడని ఆంధ్రజ్యోతి రాసింది. టిక్కెట్ల కోసం భారీగా వసూలు చేస్తున్నాడని, ఎన్నికల్లో వైకాపా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఒకప్పుడు కోట్లు ఇచ్చినవారు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారని, అవకాశం దొరికితే బయటకు వెళ్లిపోదామనే ప్రయత్నాల్లో ఉన్నారని రాసింది. జగన్‌ మీడియా ప్రచారాన్ని ముఖ్య నాయకులు పెద్దగా ఖండించడంలేదు. అదీగాక ఒకప్పుడు కీలకంగా కనిపించిన నాయకులు కొంతకాలంగా మీడియాలో కనబడకపోవడం కూడా వ్యతిరేక ప్రచారానికి తావిస్తోంది. ఏది ఏమైనా వైకాపా బలం పెరిగిందా? తగ్గిందా? తెలియాలంటే అందుకు ఎన్నికలే గీటురాయి. 
-అమృత
- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/what-happen-in-ycp-49764.html#sthash.nuxhU8TM.dpuf

0 Reviews:

Post a Comment