Contact us

రాష్ట్రపతి ప్రణబ్‌కు చేరిన ఫైలు ..నేడు వెలువడనున్న నిర్ణయం..
బిల్లుపై వ్యవధి పెంపునకు హోం శాఖ సుముఖం
రాష్ట్రపతి ప్రణబ్‌కు చేరిన ఫైలు ..నేడు వెలువడనున్న నిర్ణయం..నాలుగు వారాలిస్తే బిల్లుకు గండమే
పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం సాధ్యంకాదు: హోం వర్గాలు
రెండు వారాలిస్తే ఏడు దాకా అసెంబ్లీ
విభజన బిల్లుపై శాసనసభలో చర్చకు మరో రెండు వారాలు గడువు పెంచేందుకు కేంద్ర హోం శాఖ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ ఫైలు సోమవారం రాత్రే ప్రధాని కార్యాలయం ద్వారా రాష్ట్రపతి కార్యాలయానికి హోంశాఖ చేర్చినట్లు సమాచారం. దీనిపై మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.
హైదరాబాద్, జనవరి 20 : విభజన బిల్లుపై చర్చకు మరో నాలుగు వారాలు గడువు పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రపతికి ఇప్పటికే లేఖ వెళ్లింది. దీనిపై రాష్ట్రపతి కేంద్ర హోంశాఖ అభిప్రాయం కోరగా... 'నాలుగు వారాలు అవసరంలేదు. మరో రెండు వారాలు గడువు పెంచితే సరిపోతుంది' అని సమాధానం వచ్చినట్లు తెలిసింది. రాష్ట్రపతి దీనికి అంగీకరిస్తే... ఫిబ్రవరి 7వ తేదీ దాకా చర్చకు గడువు లభించినట్లవుతుంది. అభిప్రాయాల క్రోడీకరణకు మరో మూడు రోజుల సమయం ఉంటుంది. అంటే... వచ్చేనెల 10వ తేదీకి విభజన ప్రక్రియలో అసెంబ్లీ పాత్ర ముగుస్తుందని చెప్పవచ్చు. అప్పటికి పార్లమెంటు సమావేశాలు కూడా మొదలవుతాయి. అందువల్ల... బిల్లును ప్రవేశపెట్టేందుకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని తెలంగాణ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి సోమవారం రాత్రే దీనిపై రాష్ట్రపతి తుది నిర్ణయం తీసుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే... హోంశాఖ నుంచి ఫైలు రావడం ఆలస్యం కావడంతో నిర్ణయం మంగళవారానికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. 23వ తేదీతోనే చర్చ ముగిసిపోయే పక్షంలో.. ముందుగా ఖరారైన షెడ్యూలు ప్రకారం మంగళవారం సభలో ఈ అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడాల్సి ఉంది. అయితే... పొడిగింపు ఖాయమని తెలియడంతో ప్రసంగాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. పొడిగింపుపై రాష్ట్రపతి నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత.. బీఏసీ సమావేశం నిర్వహించి తదుపరి షెడ్యూలును ఖరారు చేస్తారు.
కాగా, రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు రాష్ట్రపతి నాలుగు వారాల గడువిస్తే మాత్రం పార్లమెంట్ సమావేశాలు వచ్చే 21తో ముగుస్తున్నందున తెలంగాణ బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి ఆస్కారం ఉండదని హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ నుంచి బిల్లు తిరిగొచ్చిన తర్వాత అది మళ్లీ కేంద్ర కేబినెట్‌కు వెళుతుంది. కేబినెట్ దాన్ని రాష్ట్రపతికి పంపుతుంది. బిల్లును పార్లమెంటులో పెట్టాలని సిఫార్సు చేస్తూ రాష్ట్రపతి హోం శాఖకు పంపిస్తారు. హోంశాఖ ఈ బిల్లును పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి పంపుతుంది. ఆయన తగిన సమయంలో రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి నాలుగు వారాల అదనపు గడువిస్తే ఆ తర్వాత ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి పార్లమెంట్ సమావేశాలు ముగిసే అవకాశముంది. సాధారణంగా ఓటాన్ అకౌంట్ సమావేశాలే చివరివి. ఈ ప్రభుత్వ హాయంలో మరోసారి పార్లమెంట్ సమావేశాలకు అవకాశం లేనందున ఇప్పుడే బిల్లును ప్రవేశపెట్టాలనుకుంటున్నట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి.
కేబినెట్ కార్యదర్శితో నేడు సీఎస్ భేటీ
న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం ఉదయం కేంద్ర కేబినెట్ కార్యదర్శితో ఆయన భేటీ అవుతారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రతినెలా వివిధ అంశాలపై కేబినెట్ కార్యదర్శి ఆయా రాష్ట్రాల సీఎస్‌లతో సమావేశమవుతుంటారని, ఇందులో భాగంగానే మహంతికి పిలుపు వచ్చిందని పేర్కొన్నాయి. అయితే, రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చకు మరో నాలుగు వారాలు గడువు కావాలంటూ కేంద్రాన్ని రాష్ట్రం కోరిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మంగళవారం ఉదయం కేబినెట్ కార్యదర్శితో భేటీ తర్వాత సాయంత్రం మహంతి తిరిగి హైదరాబాద్ వెళ్లిపోతారని అధికారిక వర్గాలు చెప్పాయి.
- See more at: http://www.andhrajyothy.com/node/56331#sthash.jbKLY1De.dpuf

0 Reviews:

Post a Comment