Contact us

వైకాపా వ్యూహాత్మక తప్పిదం?
రాజ్యసభ ఎన్నికల బరిలోంచి తప్పుకుంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి. తమకు తగిన సంఖ్యాబలం లేదనీ, అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకునేంత బలం లేదు గనుక, రాజ్యసభ ఎన్నికల బరిలోంచి తప్పుకుంటున్నట్లు ఆ పార్టీ అధికారికంగా వెల్లడించింది. బరిలోంచి తప్పుకోవడమే కాక, ఏ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థికీ ఓటేయకూడదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించుకోవడం గమనార్హం.
మామూలుగా అయితే రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీలకే అవకాశం వుంది. కానీ, ఈసారి రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల కారణంగా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతోపాటు టీఆర్‌ఎస్‌కీ అవకాశం దక్కింది. ఆ మాటకొస్తే, గట్టిగా ప్రయత్నించాలేగానీ చిన్నా చితకా పార్టీలూ ప్రధాన పార్టీలకి షాకిచ్చే పరిస్థితులున్నాయి.
ఈ తరుణంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తమది వ్యూహాత్మక అడుగు.. అని చెప్పుకోవచ్చుగానీ.. ఆ పార్టీ చేస్తున్నది వ్యూహాత్మక తప్పిదమే అని చెప్పొచ్చు. కాంగ్రెస్‌ని విభేదించిన ఆ పార్టీ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగుతున్న విషయం విదితమే. టీఆర్‌ఎస్‌ కూడా తగిన సంఖ్యాబలం లేకున్నా రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలనే ఆలోచనతోనే వుందింకా
40 ప్లస్‌ ఎమ్మెల్యేలు అవసరం రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఏపార్టీకైనాసరే. పెద్దల సభ గనుక, కాస్తంత ప్రయత్నించి సమైక్య ఉద్యమమో లేదంటే, వివాద రహితుడైన అభ్యర్థి అనో.. ఏదో ఒకటి చెప్పి వేరే పార్టీల్లోని ఎమ్మెల్యేలను తమకు అనుకూలంగా మార్చుకుంటే అధికార కాంగ్రెస్‌ పార్టీకీ, ప్రధాన ప్రతిపక్షానికీ షాకిచ్చినట్లవుతుంది. కానీ, వైకాపా చేతులెత్తేయడం వెనుక అసలు కారణమేంటో ఎవరికీ అర్థం కావడంలేదు.
సమైక్య ఛాంపియన్‌ అని చెప్పుకుంటున్నందున వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వేరే పార్టీల్లోంచి పెద్దయెత్తున నేతలు వస్తూనే వున్నారు. ఈ మధ్య ఆ హడావిడి తగ్గినా, రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిని నిలబెడితే, ఎన్నికల నాటికి తగిన బలం లభించడం పెద్ద కష్టమేమీ కాదు. త్వరలో కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారనే వార్తలే వైకాపా బలాన్ని చెప్పకనే చెబుతున్నాయి.
ఇక, రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ - టీడీపీ - టీఆర్‌ఎస్‌ కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నాయనీ, ఆ కుమ్మక్కు రాజకీయాల్లో భాగం కాదలచుకోలేదు కాబట్టే రాజ్యసభ ఎన్నికలకు దూరంగా వున్నామన్నది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ వెర్షన్‌. వైకాపా ఉద్దేశ్యం ఏదైనా.. ఆ పార్టీ రాజ్యసభ ఎన్నికలకు దూరంగా వుండాలని తీసుకున్న నిర్ణయం కారణంగా ఆ పార్టీపై ప్రత్యర్థి పార్టీలు తీవ్రస్థాయిలో విరుచుకుపడేందుకు ఆస్కారం ఏర్పడింది.
- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/ycp-big-mistake-49873.html#sthash.4pzs3Tsn.dpuf

0 Reviews:

Post a Comment