Contact us

వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ, సంస్థాగత ఎన్నికలు



హైదరాబాద్: వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ వచ్చే నెల 2న వైఎస్ ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలో నిర్వహించనున్నారు. ప్లీనరీకి ముందే సంస్థాగత ఎన్నికలు జరపాలని నిర్ణయించినట్టు పార్టీ సంస్థాగత ఎన్నికల కన్వీనర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.

ఫిబ్రవరి 1న వైఎస్ ఆర్ సీపీ సంస్థాగత ఎన్నికలు జరగనున్నాయి. ఆ రోజు మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల వరకు సీజీసీ భేటీ నిర్వహిస్తారు. ఆ వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తారు. 3 నుంచి 4 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. సాయంత్రం 4 నుంచి 4:30 గంటల వరకు నామినేషన్లను పరిశీలించి 5 గంటలకు ఆమోదిత నామినేషన్లను ప్రకటిస్తారు. ఆ మరుసటి అంటే ఫిబ్రవరి 2న ఉదయం 8:30 నుంచి 11:30 వరకు పోలింగ్‌ జరగనుంది. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి 12:30కు గెలిచిన అభ్యర్థులను ప్రకటిస్తారు. ప్లీనరీకి దాదాపు 9వేల మందిని ఆహ్వానించినట్టు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పీఎన్వీ ప్రసాద్ తెలిపారు. ఫిబ్రవరి 2న ఉదయం 8 గంటల లోపే హాజరుకావాలని సూచించారు
ఇప్పటి వరకు వైసిపి ఒకే ఒక్కసారి ప్లీనరీ నిర్వహించింది. ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, విభజన తీర్మానం, సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి వంటి అంశాలపై ప్లీనరీలో సుదీర్ఘంగా చర్చించాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రాంతంలో క్యాడర్ కు నాయకత్వం వహించే బాధ్యతలు ఎవరికి అప్పచెప్పాలి అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్లీనరీలోనే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను బరిలో దింపేందుకు కసరత్తులు చేయనున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. కొత్తగా పార్టీలోకి వచ్చే వారికి ఇవ్వాల్సిన స్థానాలను కూడా ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీ నేతల అభిప్రాయాలు జగన్ తీసుకోనున్నారు. మొత్తానికి అన్ని రకాల సన్నాహాలకు వైసీపీ సిద్ధమవుతోంది.

0 Reviews:

Post a Comment