Contact us

ఇద్దరు ‘నాయుళ్ళ’ దొంగాట
పార్టీ కన్నా ప్రాంతం గొప్పది
ప్రాంతం కన్నా ప్రయోజనం గొప్పది
ఈ ‘సిధ్ధాంతాన్ని’ నమ్ముకున్నారు. రాష్ట్రంలో ఇద్దరు నేతలు. ఇద్దరికీ పార్టీలు మాత్రమే వేరు.
కానీ ఇద్దరీ ‘ప్రయోజనం’ ఒక్కటే. ఆశ్చర్యం, ఇద్దరి పేర్లూ ఒక్కటే. 
ఆయనా ‘నాయుడే’, ఈయన ‘నాయుడే’.ఇప్పటి ‘భౌగోళిక రాజకీయం’ ప్రకారం, ఇద్దరూ  సీమాధ్రులే.  ఒకరు: చంద్రబాబు నాయుడు.  ఇంకొకరు : వెంకయ్య  నాయుడు. ఒకరు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు, మరొకరు బీజేపీ పూర్వాధ్యక్షులు.
ఇద్దరీ స్నేహాలకూ ఎప్పుడూ పార్టీలు అడ్డురాలేదు. ఇప్పుడూ అడ్డురావడం లేదు. ఈ ‘స్నేహం’ ఇద్దరికీ లాభించింది. ఈ స్నేహం వల్ల చంద్రబాబు రెండవ సారి ముఖ్యమంత్రి కాగలిగారు. ఈ స్నేహం వల్లే వెంకయ్య నాయుడు తన పార్టీలో జాతీయాధ్యక్షుడు , పార్టీ అధికారంలో వున్నప్పుడు కేంద్రమంత్రి కాగలిగారు.
చంద్రబాబే తెలుగుదేశం, తెలుగుదేశమే చంద్రబాబు కాబట్టి, ఈ స్నేహం వల్ల కూడా తెలుగుదేశం కూడా లాభపడిరది. కానీ, బీజేపీయే వెంకయ్య నాయుడు, వెంకయ్య నాయుడే బీజేపీ కాదు. అదో పెద్ద జాతీయ పార్టీ. కాబట్టి వెంకయ్యనాయుడు లాభపడి, పార్టీ నష్టపోయింది. 1999లో ఇదే జరిగింది. ఇప్పుడు (2014) కూడా అదే జరగబోతోంది. 1999లో ‘కార్గిల్‌ యుధ్ధం’ కారణంగా బీజేపీ గాలి రాష్ట్రంలో బలంగా వీచినప్పుడు, ఆ ‘గాలి’కి బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు కూడా మళ్ళీ రాష్ట్రంలో గద్దెనెక్కారు. ఈ పొత్తుకు అప్పట్లో సూత్రధారి వెంకయ్య నాయుడే. ఈ ‘పొత్తు’ ఎంత గొప్పగా సాగిందంటే,  బీజేపీ కేంద్రం నాయకత్వానికి, రాష్ట్రంలో కూడా బీజేపీ నాయకత్వం వుందన్న స్పృహే కోల్పోయింది.చంద్రబాబు మాటే వారికి వేదమయ్యేది. ఒక్క వెంకయ్యనాయుడు మినహా, రాష్ట్ర బీజేపీలో ఏ ఒక్క నేత మాటా చెల్లేది కాదు. ‘బాబు’ మనసును నొప్పించే ఏ పనిని చెయ్యటానికీ, బీజేపీ కేంద్ర నాయకత్వం ‘తెగించేది’ కాదు. అలా క్రమేపీ, బీజేపీ అయిదేళ్ళలో దాదాపు శూన్యమయిపోయింది. 2009 లో ఏడుపార్లమెంటు సీట్లను గెలుచుకున్న బీజేపీ 2004 ఎన్నికలకు వచ్చేసరికి, ఒక్క సీటును కూడా దక్కించుకోలేక పోయింది. ఇక శాసన సభలో సరేసరి కేవలం ఇద్దరే సభ్యులు ‘జంట కమలాలు’గా మిగిలిపోయారు. 
మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగబోతోంది. ఇంకా రెండు పార్టీల మధ్యా ‘వియ్యం’ ఖరారు కాలేదు. ఇప్పుడు కేవలం ‘డేటింగ్‌’ మాత్రమే నడుస్తోంది. అప్పుడే రాష్ట్ర బీజేపీ రెండుగా ‘చీలింది’. రాష్ట్రవిభజన పై కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పటి నుంచీ, అన్ని పార్టీలూ ప్రాంతాల ప్రకారం రెండుగా చీలినా, ‘బీజేపీ, సిపిఎం’ మాత్రం స్థిరంగా వుండిపోయాయి. బీజేపీ ‘ప్రత్యేక వాదాని’కీ, సిపిఎం ‘సమైక్య వాదాని’కీ కట్టుబడి వున్నాయన్న పేరు తెచ్చుకున్నాయి. కానీ రాష్ట్ర బీజేపీ కూడా ‘తెలంగాణ బీజేపీ’ గానూ,  ‘సీమాంధ్ర బీజేపీ’ గానూ చీలిపోయింది.  ఈ ‘పుణ్యానికి’ కారకులు  ఈ ఇద్దరు ‘నాయుళ్ళే’. 
బీజేపీ- తెలుగు దేశం పార్టీల మధ్య ఇంకా పొత్తు లాంఛనంగా వికసించనే లేదు. ఇంతవరకూ ఇది బహిరంగ వేదిక లమీద( బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పదవీ స్వీకార ఉత్సవ వేదికలు లాంటివి) ‘కరచాలనాల’కూ, ‘కౌగలింతల’కూ పరిమిత మయ్యింది. అయినప్పటికీ, దీని ఫలితం కనిపిస్తుంది. 
బాబుది ‘దృతరాష్ట్ర కౌగిలి’!
ఆ మాట కొస్తే, రాజకీయాల్లో చంద్రబాబు ‘కౌగలింత’కు ఓ ప్రత్యేకత వుంది. ఆయనది ‘దృతరాష్ట్ర కౌగిలి’ అంటారు. దృతరాష్ట్రుడి కౌగిలి లో భీముడి విగ్రహం ఎలా పిప్పి పిప్పి అవుతుందో, రాజకీయంగా చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న వారు కూడా అలాగే  అవుతారన్నది సారాంశం. ఈ విషయాన్ని ముందు చెబితే ఎవరూ వినరు. అనుభవించాక, చెప్పటానికి ‘కౌగిలి’ లోకి వెళ్ళిన వారు మిగిలి వుండరు.  ఒకప్పుడు  కమ్యూనిస్టులు (సీపీఐ, సీపీఎం)లు ఆ విధంగా ఆయనతో పొత్తు పెట్టుకుని ముక్కలయ్యారు. ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. అప్పటి నుంచీ ‘బాబు కౌగిలి’కి అంతటి ఖ్యాతి వచ్చింది. 
కానీ బీజేపీ ఒక్క సారి ఈ ‘కౌగిలి’ లోకి వెళ్ళి ముక్కలయి వచ్చిన పార్టీయే ఇప్పుడిప్పుడే మళ్ళీ అతుక్కుంటోంది. తెలంగాణలో అంతో, ఇంతో కోలుకుంది. ఉపఎన్నికలలో కొన్ని చోట్ల టీఆర్‌ఎస్‌ తో ‘ఢీ అంటే ఢీ’ అన్నది. అలాగే ‘సీమాంధ్ర’లో కూడా కార్యకర్తల్ని పెంచుకున్నది. ఈ స్థితిలో మళ్ళీ పొత్తుకు సిధ్ధ మవుతోంది. 
చిత్రమేమిటంటే, ఈ రెండు పార్టీలు ఎప్పుడు పొత్తు పెట్టుకున్నా, ‘తెలంగాణ’ అంశం తెరమీదకు వస్తూ వుంటుంది. అప్పుడు కూడా చిన్నరాష్ట్రాలు ఇచ్చే పని పెట్టుకున్న ఎన్డీయే సర్కారు, పన్లోపనిలాగా  ‘తెలంగాణ’ ఇచ్చి వెయ్యటానికి సిధ్ధమయింది. కానీ, రాష్ట్రం మీద భక్తి కన్నా, తన పార్టీ భవితవ్యం మీద దృష్టితో చంద్రబాబు ఇందుకు అడ్డం తిరిగారు. అంతే, ఎన్డీయే వెనక్కి తగ్గింది.
ఇప్పుడు మళ్ళీ, ఇదే అంశం ఎజెండా మీదకు వచ్చింది. బీజేపీ ‘తెలంగాణ బిల్లు’కు మద్దతు ఇస్తానని ‘కమిట్‌’ అయిపోయాక, బాబు కౌగిలి చెంతకు వచ్చింది. కానీ బాబు ఇప్పుడు గతంలోలాగా లేరు. ఆయన  అప్పట్లోలాగా ‘సమైక్యవాదీ’ కారు, మధ్యలో లేఖలో లిఖిత పూర్వకంగా మారిన ‘ప్రత్యేక వాదీ’ కారు. రెంటికీ మధ్యగా ‘రెండు కళ్ళ’ సాక్షిగా, ‘రెండు చిప్పల’ మాదిరిగా ఆయన ‘సమన్యాయ’ వాది. ఇప్పుడు  ఎవరు పొత్తు కు వచ్చినా వారి చేతిలో బాబు ‘రెండు చిప్పల్నీ’ పెట్టి తీరతారు. అప్పట్లో తన ‘సమైక్యవాదాన్ని’ బీజేపీ ఎలా అంగీకరించాల్సి వచ్చిందో, ఇప్పుడు ఆయన ‘రెండు చిప్పలవాదాన్నీ’ ఒప్పుకోవాల్సిందే. ఈ వాదాన్ని బీజేపీ కేంద్ర నాయకత్వం చెవుల్లో మోతెక్కించే బాధ్యతను బాబు చిరకాల మిత్రుడు వెంకయ్య నాయుడు భుజాన వేసుకున్నారు. 
‘నాయుడు’ బ్రదర్స్‌ జుగల్‌ బందీ!
జాగ్రత్తగా వింటే, ‘పసుపు’(టీడీపీ) నాయుడు ఏ పాట పాడుతున్నాడో, ‘కాషాయం’ (బీజేపీ) నాయుడు కూడా అదే పాట పాడుతున్నారు. వీరి ‘జుగల్‌ బందీ’ కీ బీజేపీ రాష్ట్ర శాఖ కకావికలమయిపోయింది. రెండు పాయలుగా విడిపోయింది. ఒక పాయకు సీమాంధ్ర నేత హరిబాబు నాయకత్వం వహిస్తుంటే, ఇంకో పాయకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డికి సారథ్యం వహిస్తున్నారు. వెంకనాయుడు బాబు కోసం హరిబాబును వెనకేసుకొస్తున్నారు. 
మిగిలిన పార్టీలలోని సీమాంధ్ర నేతల్లాగా హరిబాబు బృందం ‘సమైక్య’ నినాదం ఇచ్చినా ఒక రకంగా వుండేది. కానీ వీరు ‘సమైక్య నినాదం’ ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలం అంటూనే,  ‘సీమాంధ్ర’ కు మేలు చేయాలంటున్నారు. అక్కడితో ఆగకుండా, ‘అయోధ్య రాముడి’ ని వదలి ‘భద్రాద్రి రాముణ్ని’ పట్టుకున్నారు. భద్రాచలాన్ని సీమాంధ్రలో వుంచాలని డిమాండ్‌ చేశారు. అలాగే కొత్త రాజధాని ఏర్పాటు(స్థలమూ, ఖర్చూ వగైరాల గురించి) రాష్ట్ర పునర్విభజన బిల్లులో స్పష్టం చేయాలన్నారు. తెలంగాణ ఏర్పాటు పై కేంద్రం ప్రకటన వెలువడిన వెంటనే చంద్రబాబు కూడా  సీమాంధ్ర రాజధాని ఖర్చు గురించి మాట్లాడారు ‘నాలుగు లక్షల కోట్లు రాజధానికి ఇస్తే ఆ ప్రాంత ప్రజలు సరిపెట్టుకోగలరు’ అన్న రీతిలో మాట్లాడారు. 
అంటే ‘సమన్యాయం’ పేరు మీద చంద్రబాబు నోటి నుంచి ఏ మాటలు వస్తున్నాయో, దాదాపు అవే, మాటలు ‘వెంకయ్య అండ్‌ కో’ నుంచి రావటం విశేషం.  ఒక్క ముక్కలో చెప్పాలంటే, ‘సమన్యాయం’ పేరు మీద చంద్రబాబు ఆడేదీ, ‘ప్రత్యేకం’ పేరు మీద వెంకయ్య ఆడేదీ ఓ ‘దొంగాట’. ఈ ఆటలో అంతిమంగా నష్టపోయేది ఎవరన్నది చరిత్ర తెలిసిన వారు సులభంగా చెప్పవచ్చు. ‘కమలం’ వచ్చి ‘సైకిలు’ మీద పడ్డా, ‘సైకిలు’ వచ్చి ‘కమలం’ మీద పడ్డా, నలిగిపోయేది ‘కమలమే’!
 -సతీష్‌ చందర్‌
- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/iddaru-nayalu-dongata-49911.html#sthash.xGJHNhFG.dpuf

0 Reviews:

Post a Comment