
అన్నదమ్ముల ఆధిపత్య పోరుకు ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట వేయాలని భావించి కరుణానిధి అదునుచూసి పెద్ద కుమారుడికి చెక్ పెట్టారు. క్రమశిక్షణ ఉల్లంఘించారనే నెపంతో ఆళగిరిని పార్టీ నుంచి సాగనంపారు. ప్రాథమిక సభ్యత్వం సహా అన్ని పదవుల నుంచి ఉద్వాసన పలికారు. సినీ నటుడు విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకేతో పొత్తు ప్రతిపాదనకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయనపై ఈ చర్య తీసుకున్నట్టు తెలిపారు. అయితే ఈ ఎడబాటు తాత్కాలికమేనని మెలిక పెట్టారు.
ఆళగిరిపై వేటు వేయడం ద్వారా పార్టీ ముందు అందరూ సమానమే అని పెద్దాయన సంకేతాలిచ్చారు. అదే సమయంలో ఆళగిరికి పూర్తిగా తలుపులు మూసివేయకుండా జాగ్రత్త పడ్డారు. స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరిస్తే ఆళగిరికి మళ్లీ పార్టీలోకి ద్వారాలు తెరుచుకునే అవకాశాన్ని సజీవంగా ఉంచారు. ఆళగిరి సస్పెన్షన్ తో అటు స్టాలిన్ కూడా వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే సొంత కొడుకులపై చర్య తీసుకునేందుకు వెనుకాడబోనన్న సంకేతాలిచ్చారు. తద్వరా అన్నదమ్ముల ఆధిపత్య పోరుకు తాత్కాలికం బ్రేకు వేశారు.
అయితే తనను అవమానించిన తండ్రి, సోదరుడుపై ఆళగిరి కారాలు-మిరియాలు నూరుతున్నారు. స్టాలిన్ చేతిలో కరుణానిధి కీలుబొమ్మగా మారారని ఘాటుగా విమర్శించారు. స్టాలిన్ పదవీ కాంక్షాపరుడు, అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే మట్టి కరవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ నెల 31న ప్రెస్‌మీట్ పెట్టి డీఎంకే లొసుగుల చిట్టా విప్పుతానన్నారని హెచ్చరించారు. తమిళనాడు రాజకీయాల్లో సుదీర్ఘ చరిత్ర కలిగిన డీఎంకే అధినేత సొంత సమస్యను ఎలా అధిగమిస్తారో చూడాలి.
sakshi
0 Reviews:
Post a Comment