Contact us

వైసీపీలోకి వెళ్లిన నేతల పరిస్థితి కూడా అంతే!
వైసీపీకి నేతల గుడ్‌బై
జెట్ స్పీడుతో బయటకొసత్తున్న అభ్యర్థులు
ఆత్మగౌరవాన్ని చంపుకోలేమి వ్యాఖ్యలు
బీజేపీపైపు చూస్తున్న రఘరామ కృష్ణరాజు!
ఇమడలేక బయటపడుతున్న పొట్లూరి,తోట ,బొడ్డు
ఉత్సుకత చూపి వెనక్కుపోయిన ఐఏఎస్‌లు

ఆహా ఓహో అనుకున్నారు. పార్టీలో చేరి, టికెట్ కొడితే ఇక తిరుగేలేదనుకున్నారు. ముందుగా పార్టీలో చేరారు. ఆ తర్వాత 'తత్వం' బోధపడి లబోదిబోమంటున్నారు. 'దూరపు కొండలు నునుపు' సామెతను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. రాజకీయ నాయకులు, ఐఏఎస్‌లు, పారిశ్రామిక వేత్తలు... ఇలా ఎందరో! జగన్ పార్టీ నుంచి 'మిడిల్ డ్రాప్!' అవుతున్నారు. ఎందుకు? ఏమిటి?
(హైదరాబాద్ - ఆంధ్రజ్యోతి)
గోడకు కొట్టిన బంతి ఎంత వేగంగా వెళుతుందో.. అంతే వేగంగా వెనక్కి వస్తుంది! ఇప్పుడు.. వైసీపీలోకి వెళ్లిన నేతల పరిస్థితి కూడా అంతే! మొదట్లో ఆ పార్టీలోకి వలసలే వలసలు! వివిధ పార్టీల నేతలు క్యూ కట్టారు! ఇప్పుడు ఆ పార్టీలోకి కొత్తగా ఎవరూ వెళ్లడం లేదు! సరికదా.. మొదట్లో వెళ్లిన వాళ్లలో చాలామంది ఎప్పుడో బయటకు వచ్చేశారు! మిగిలిన వాళ్లు ఇప్పుడు తట్టాబుట్టా సర్దుకుని జెడ్ స్పీడుతో వచ్చేస్తున్నారు! అప్పట్లో.. వైఎస్ మీద అభిమానంతోనో.. భవిష్యత్తు అంతా 'బంగారం'లా ఉంటుందనో ఉత్సాహంగా వెళ్లారు! కోట్లు సమర్పించుకున్నారు! మరికొన్ని కోట్లు ఖర్చు చేశారు! కానీ, పార్టీ అధినేత జగన్‌ను దగ్గర నుంచి చూసిన తర్వాత.. ఆయన 'తత్వం' బోధపడిన తర్వాత వ్యక్తిగత గౌరవాన్ని, రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టడానికి సిద్ధపడడం లేదు! డబ్బులు పోయినా పర్లేదు. ఆత్మ గౌరవాన్ని నిలుపుకొంటే చాలంటూ జగన్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి ఆత్మీయులు, సన్నిహితుల వరకూ.. అత్యధికులు జగన్‌కు దూరంగా జరుగుతున్నవారే! ఇందుకు జగన్ అహంభావం ఒక కారణమైతే.. రోజు రోజుకు ఆయన గ్రాఫ్ పడిపోతుండడం మరో కారణం! తొలుత సీటు హామీ ఇచ్చి.. ఆ తర్వాత నాలుక మడతేయడం మరో కారణం! 'అహం బ్రహ్మస్మి' అంటూ వ్యవహరిస్తున్న జగన్ పార్టీ నేతలని కూడా చూడకుండా చులకనగా చూస్తున్నారని వారంతా వాపోతున్నారు.
నిజానికి, వారంతా కూడా నేతలే. కోట్లకు పడగలెత్తిన పారిశ్రామికవేత్తలే! అందుకే.. ఆత్మ గౌరవాన్ని చంపుకొనే కంటే వైసీపీని వీడడమే మంచిదని మిడిల్ డ్రాప్ అవుతున్నారు. కుటుంబ సభ్యులూ ఇందుకు మినహాయింపు కాదు. వైసీపీని స్థాపించడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని కంటికి రెప్పలా కాపాడిన జగన్ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి కూడా ఇప్పుడు తన దారి తాను చూసుకున్నారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఒంగోలు లోక్‌సభ సీటు ఆశించి ఆయన భంగపడ్డారని, అందుకే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని వివరిస్తున్నాయి. ఇక, జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీ బాధ్యతలను భుజాన వేసుకుని వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి పార్టీ శ్రేణుల్లో మనో ధైర్యాన్ని నింపిన ఆయన సోదరి షర్మిల కూడా అన్నపై అలిగి బెంగళూరు వెళ్లిన సంగతి తెలిసిందే. మీడియాలో కథనాలు రావడంతో తమ మధ్య ఎలాంటి వైషమ్యాలూ లేవంటూ ముక్తసరిగా చెప్పేందుకు ప్రయత్నించినా.. ఆ తర్వాత కూడా ఆమె దూరంగానే ఉంటున్నారు. ఇక, మరో కీలక వ్యక్తి రఘురామ కృష్ణరాజు. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా ఆయన కుటుంబానికి ఆత్మీయుడిగా వ్యవహరించారు. జగన్‌పై సీబీఐ దర్యాప్తు జరిగిన సమయంలో ఏకంగా జేడీ లక్ష్మీనారాయణ కాల్ లిస్టును తీసుకుని వివాదాస్పదుడయ్యారు. వైఎస్ ఆత్మబంధువు కేవీపీకి ఆయన వియ్యంకుడు కూడా. ఆయన నరసాపురం లోక్‌సభ సీటు ఆశించారు. ప్రచార సామగ్రిని సిద్ధం చేసుకున్నారు. అలాంటి వ్యక్తి కూడా ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. వైసీపీతో తెగదెంపులు చేసుకుని బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధపడ్డారని ఆ పార్టీలోని వారే చెబుతున్నారు. ఆయనను నిలువరించేందుకు జగన్ దగ్గరి బంధువు వైఎస్ అనిల్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాయని, బీజేపీలో చేరి నరసాపురం సీటు కోరాలని ఆయన భావిస్తున్నారని ఆ వర్గాలు వివరించాయి. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన మరో పారిశ్రామికవేత్త పీవీపీ వెంచర్స్ అధినేత పొట్లూరి వరప్రసాద్. ఆయన విజయవాడ లోక్‌సభ సీటు ఆశించారు. అచిర కాలంలోనే తత్వం బోధపడి.. జగన్ వద్ద తన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టలేక ఇప్పుడు పార్టీకి దూరమవుతున్నారు. జగన్ మరో బాధితుడు తోట చంద్రశేఖర్. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు ఆ పార్టీ ఖర్చులన్నీ భరించారు.
గుంటూరు లోక్‌సభ నుంచి బరిలోకి దిగారు. ఓడిపోయి ఐదేళ్లపాటు కనుమరుగయ్యారు. చివరికి, నాలుగు నెలల కిందటే ఆయన వైసీపీలో చేరారు. ఏలూరు లోక్‌సభ సీటు తనకేనని భావించారు. దీంతో, నియోజకవర్గంలో పార్టీ పరంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నికల్లో గెలుపునకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన కూడా.. వైసీపీలో ఇమడలేక బయటకు వచ్చేస్తున్నారని తెలిసింది. తన కుమారుడి కోసం రాజమండ్రి లోక్‌సభ స్థానాన్ని ఆశించిన బొడ్డు భాస్కర రామారావు కూడా ఇప్పుడు 'బై జగన్' అంటున్నారని తెలిసింది. ఇప్పటికే నష్టపోయింది చాలని.. మరింత నష్టపోకూడదనే ఆయన మిడిల్ డ్రాప్ అవుతున్నట్లు తెలిసింది. అలాగే, గుజరాత్‌లో ఐఏఎస్ అధికారిగా పని చేస్తున్న కిశోర్ తన పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని భావించారు. బాపట్ల ఎంపీ టికెట్ ఇస్తే వస్తానని డిమాండ్ చేసిన ఆయన.. తాజాగా ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. మరోవైపు బాపట్ల లోక్‌సభ సీటును చెన్నైలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే గూడూరు సునీల్ ఆశిస్తున్నారు. దీంతో, టికెట్ విషయంలో ఆయన పరిస్థితి కూడా ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డికి వివాదరహితుడిగా పేరు. జగన్ జైలు నుంచి రాగానే పరామర్శించేందుకు వెళ్లిన ఆయనకు వైసీపీ కండువా కప్పుతారని భావించారు. పార్టీలోకి జగన్ ఆహ్వానించారని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, ఆ తర్వాత జగన్ వ్యవహార శైలిని తెలుసుకున్న ఆయన.. వైసీపీలోకి వెళ్లేందుకు సాహసించలేదు. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను కలిసేందుకు జగన్ ఇటీవల బీహార్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో.. బీహార్లో సీనియర్ ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్న రాష్ట్రాన్ని చెందిన కేపీ రామయ్య జగన్‌కు కాస్త దగ్గరయ్యారు. వైసీపీలో చేరదామని భావించారు. సన్నిహితుల ద్వారా జగన్, వైసీపీ వ్యవహార శైలిని తెలుసుకుని.. బాబోయ్ అనవసరమైన తంటాలు ఎందుకని విరమించుకున్నారు. నితీశ్ పార్టీలోనే చేరి అక్కడి నుంచే లోక్‌సభకు పోటీ చేసే ఉద్దేశంలో ఉన్నారు.

- See more at: http://www.andhrajyothy.com/node/59524#sthash.uCev8gzG.dpuf

0 Reviews:

Post a Comment