Contact us

సోనియావల్లే సీఎంనయ్యా...
అందరితో మాట్లాడాకే కార్యాచరణ
సోనియావల్లే సీఎంనయ్యా
కానీ తెలుగు జాతి భవిష్యత్తే నాకు ముఖ్యం
కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందన్నదే ప్రజల అభిప్రాయం
నేనూ వ్యతిరేకిస్తున్నా..అందుకే విభ
జన బిల్లును తిరస్కరించాం
తెలుగు ప్రజల భవిష్యత్తును ఢిల్లీలో నిర్ణయించలేరు
జాతీయ చానల్ ఇంటర్వ్యూలో సీఎం కిరణ్
రాజకీయ భవిష్యత్తు గురించి, కొత్త పార్టీల గురించి తాను ఆలోచించట్లేదని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి తాను 16వ ముఖ్యమంత్రినని.. ఇంకా ఎంతో మంది వస్తారని.. తానో, తన పదవో ముఖ్యం కాదని.. ప్రజల అభిప్రాయం, రాష్ట్రం, రాష్ట్ర భవిష్యత్తు, తెలుగుజాతి గౌరవం చాలా ముఖ్యమైన అంశాలని ఆయన వివరించారు. అయితే.. అందరితో మాట్లాడిన తర్వాతే భవిష్యత్తు కార్యాచరణపై ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటానంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ వల్ల, సోనియాగాంధీ వల్లే తాను సీఎంను కాగలిగినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, రాష్ట్ర ఐక్యతే మిగిలిన అన్ని అంశాల కంటే తనకు ప్రధానమని సీఎం చెప్పారు. విభజనను చేపట్టి కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు భావిస్తున్నారని, అందుకే తాను కూడా విభజనను వ్యతిరేకిస్తున్నానని కిరణ్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును శాసనసభ, శాసనమండలి రెండూ ఏకగ్రీవంగా తిరస్కరించాయని.. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుపై పునరాలోచించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. గురువారం శాసనసభ సమావేశాలు వాయిదా పడిన అనంతరం సీఎం కిరణ్ ఒక జాతీయ చానల్‌తో మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తును, తెలుగు ప్రజల, తెలుగు జాతి భవిష్యత్తును ఢిల్లీలో నిర్ణయించలేరని ఆయన స్పష్టం చేశారు. శాసనసభ, మండలి విభజన బిల్లును మూజువాణి ఓటుతో తిరస్కరించాయని, ప్రజాస్వామ్యంలో మూజువాణి ఓటుకు కూడా అత్యంత విలువ ఉంటుందని గుర్తుచేశారు. ఉభయసభల్లో తిరస్కరించిన ఈ బిల్లును రాష్ట్రపతి పార్లమెంటుకు పంపకూడదని తాము ఆశిస్తున్నామన్నారు. చట్టసభలే ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయని, దాన్ని ఎవరైనా గౌరవించాల్సి ఉంటుందని హితవు పలికారు.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లో అంతర్భాగమని, విభజన వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని తాను మొదటి నుంచీ చెబుతూవస్తున్నానని సీఎం పునరుద్ఘాటించారు. దేశ చరిత్రలో ఎక్కడా శాసనసభ ఆమోదం లేకుండా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన దాఖలాలు లేవని, రాష్ట్ర విభజన అంశంలో కూడా అదే సంప్రదాయాన్ని పాటిస్తారని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్న మన దేశంలో సభలు వెల్లడించిన అభిప్రాయాలకు తప్పకుండా విలువ ఉంటుందని, ఉండాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ దేశంలో ఏర్పడిన తొలి భాషా ప్రయుక్త రాష్ట్రమని.. అంత తేలిగ్గా ఈ రాష్ట్రం ఏర్పడలేదని.. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా ఏర్పడిందని గుర్తు చేశారు.
తెలంగాణ విభజన అంశం ఎస్సార్సీ ద్వారానో, జుడిషియరీ కమిటీ ద్వారానో, సంయుక్త పార్లమెంటరీ కమిటీల ద్వారానో నిర్ణయించిన అంశం కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలకు.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విభజన ద్వారా ఎక్కువ సమస్యలు ఉత్పన్నం అవుతాయి కాబట్టే తాను వ్యతిరేకిస్తున్నానని, ఇరవైఏళ్లుగా ఇదే అభిప్రాయంతో ఉన్నానని అన్నారు. తాను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగానని, 57 సంవత్సరాల తర్వాత తాను ఈ ప్రాంతానికి చెందిన వాడిని కాదంటే అది ఎలా సమంజసం అవుతుంది? అని ఆయన ప్రశ్నించారు.

0 Reviews:

Post a Comment