
ఇంతకూ నాయకులకు స్వబుద్ధి, సొంత కార్యాచరణ అంటూ ఉంటుందా? ఉండదా? రాజకీయ ప్రత్యర్థుల్ని తిట్టిపోసే విషయంలో వారికి అలా ఉండకపోవచ్చు. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఎదుటివారిని తెగతిట్టిన వారు.. తర్వాత ఫిరాయించి ఆ పార్టీలోకే చేరి, అప్పుడేదో పార్టీ కి తగ్గట్టుగా తిట్టవలసి వచ్చినదని ఏమార్చ గలరు. అయితే కనీసం, రాష్ట్రం సమైక్యంగా ఉండాలి.. విభజన కావాలి.. అనే తరహా కీలకాంశాల్లో అయినా నాయకులకు సొంత బుద్ధులు ఉండవా అనే సందేహం ప్రస్తుతం కలుగుతోంది. రఘురామకృష్ణం రాజు పారిశ్రామిక వేత్త. ఆయన రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేసి దాన్ని జోరుగానే నడిపారు. నరసాపురం నుంచి ఎంపీ కావాలని కోరుకుంటున్న ఈ రాజు గారు.. అందుకోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిండా మూడునెలలు కూడా గడవలేదు.
కొత్త కోడలు కాళ్ల పారాణి ఇంకా ఆరక ముందే.. అత్తింటి ఆరళ్లకు బలైపోయిందన్నట్టుగా.. ఆయన మూడునెలలు గడవకముందే వైకాపా పట్ల వైముఖ్యం పెంచుకున్నారు. తెగతెంపులు చేసుకున్నారు. వైఎస్ జగన్ ఒక అపరిచితుడు అనే స్థాయిలో ఆయన విమర్శలు కూడా గుప్పించారు. అది ఆయన ఇష్టం. అయితే ఇప్పుడు తాజా ట్విస్టు ఏంటంటే.. ఆయన భాజపా తీర్థం పుచ్చుకున్నారు. పార్టీల్లో చేరకముందునుంచి తాను వీర సమైక్యరాష్ట్ర అభిలాషి అన్న బిల్డప్ ఇచ్చేలా విభజనపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఈ రఘురామకృష్ణం రాజు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ఇచ్చి తీరుతాం అంటున్న భాజపాలో ఎలా చేరారు? అంటే ఇన్నాళ్లూ ఆయన కనబరచిన సమైక్య ప్రేమ అంతా ఒక బూటకమేనా? అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. వీటిని ఆయన నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. కనీసం తను ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్న న రసాపురం ప్రజలు అయినా తనను పూర్తిగా నమ్మాలంటే, అవకాశవాదిగా అనుమానించకూడదంటే.. ఆయన ఈ సందేహాలను నివృత్తి చేయడం అవసరం.
- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/raghurama-samikyam-antha-bhutakamena-50102.html#sthash.fiVT3dR1.dpuf
0 Reviews:
Post a Comment