Contact us

రెండ్రోజుల్లో స్థలాన్ని యజమానికి అప్పగిస్తాం
‘ఈనాడు’ స్థల వివాదం కొలిక్కి
రెండ్రోజుల్లో స్థలాన్ని యజమానికి అప్పగిస్తాం
 ఆర్‌సీసీకి ఈనాడు న్యాయవాదుల నివేదన
 తుది తీర్పు నేటికి వాయిదా
 విశాఖపట్నంలో ఈనాడు కార్యాలయం ఉన్న స్థలం వివాదం ఓ కొలిక్కి వచ్చింది. సీతమ్మధారలో ఈనాడు కార్యాలయం ఉన్న స్థలాన్ని రెండు రోజుల్లోనే ఖాళీ చేసి సంబంధిత యజమాని ఆదిత్య వర్మకు అప్పగిస్తామని ఆ సంస్థ తరఫు న్యాయవాదులు మంగళవారం అద్దె నియంత్రణ న్యాయస్థానం (ఆర్‌సీసీ)కి తెలియజేశారు. అయితే కార్యాలయాన్ని ఖాళీ చేసే విషయంలో సుప్రీంకోర్టు ఏ మాత్రం గడువు ఇవ్వని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఆర్‌సీ కోర్టులో జరిగిన విచారణలో న్యాయమూర్తి ఇరువైపు న్యాయవాదుల వాదనలు విన్నారు.
 
 తుది తీర్పు నిమిత్తం కేసును బుధవారానికి వాయిదా వేశారు. ఆ స్థలంలో ఈనాడు కార్యాలయం కొనసాగాలంటే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్థల యజమాని వర్మకు ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు ఈనెల 10లోగా రూ. 2.60 కోట్ల బకాయిలు, నెలకు రూ. 17 లక్షల చొప్పున అద్దె చెల్లించాల్సి ఉంది. ఈ దృష్ట్యానే ఈనాడు కార్యాలయాన్ని ఖాళీ చేయాలని యాజమాన్యం నిర్ణయించిన సంగతి తెలిసిందే. భారీ క్రేన్లతో హుటాహుటిన ఆ స్థలాన్ని ఖాళీ చేస్తున్నారు. ప్రవేశద్వారం వద్ద దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన ‘ఈనాడు’ బోర్డును మంగళవారం తొలగించారు. బుధవారం సాయంత్రానికల్లా 2.78 ఎకరాల స్థలాన్ని, అందులో ఉన్న పది భవనాలను ఖాళీ చేసి ఇస్తామని ఈనాడు న్యాయవాదులు కోర్టుకు తెలిపారని వర్మ తరఫు న్యాయవాది వీవీ రవిప్రసాద్ వివరించారు.

0 Reviews:

Post a Comment