
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి 1951లో జరిగిన ఎన్నికలకు అవసరమైన తొమ్మిది లక్షల బ్యాలెట్ బాక్సులు గోద్రెజ్ కంపెనీ నుంచి వెళ్లినవే! ఆ తర్వాత మార్కెట్‌లోకి వచ్చిన సింథాల్ సబ్బూ వారిదే. ఇంకా... టైప్ రైటర్లు, కుర్చీలు, అల్మరాలు, బీరువాలు అన్నీ... దాదాపుగా గోద్రెజ్ కంపెనీవే. ఇప్పుడైతే గృహోపకరణాలు, వ్యవసాయోత్పత్తులు, రియల్ ఎస్టేట్, ఐటీ రంగంలోకి కూడా గోద్రెజ్ వచ్చేసింది... ఒక్క, వారి వారసుడైన రిషద్ నౌరోజీ తప్ప!
కావడానికైతే గోద్రెజ్ కంపెనీలో రిషద్ కూడా ఒక భాగస్వామే కానీ, ఈ 62 ఏళ్ల బ్రహ్మచారి మనసా వాచా కర్మణా కోరుకున్నది మాత్రం పక్షుల సాంగత్యాన్ని. ముఖ్యంగా డేగల సాన్నిహిత్యాన్ని! పక్షుల జీవితాన్ని దగ్గరగా పరిశీలించాలన్న ఆసక్తి ఆయనకు తన తండ్రి కల్‌ఖుష్రూ నౌరోజీ నుంచి ఏర్పడింది. దాంతో రిషద్ తాతగారు ఫిరోజ్‌షా గోద్రెజ్ స్థాపించిన గోద్రెజ్ కంపెనీకి తక్కిన మనవలు ఆది గోద్రెజ్, జంషెడ్ గోద్రెజ్ మాత్రమే వారసులుగా మిగిలారు. రిషద్ తండ్రి పర్యావరణ ప్రేమికుడు, ఫొటోగ్రాఫర్, కొండలు కోనలు తిరిగే స్వేచ్ఛామానవుడు. అలా తండ్రి ప్రభావం కొడుకు మీద పడింది.
రిషద్ ఇటీవలే నాగాలాండ్‌లో ఐదు రోజులు ఉండి వచ్చారు. అక్కడి వేటగాళ్లకు ఆహారంగా మారి అంతరించిపోతున్న అరుదైన అముర్ ఫాల్కన్ అనే చిన్న సైజు డేగ జాతిని కాపాడడానికి గల అవకాశాలను పరిశీలించారు. అముర్ ఫాల్కన్‌లు ఏటా తూర్పు ఐరోపా, మధ్య ఆసియాల నుండి మన ఈశాన్య ప్రాంతాలకు వలస వచ్చి, అక్కడి నుంచి ఆఫ్రికా వెళ్లిపోతాయి. వీటి ప్రయాణానికి ప్రాణాంతకమైన అడ్డంకులు లేకుండా చేయాలని రిషద్ తపన. త్వరలోనే ఆయన బల్పక్రమ్ నేషనల్ పార్క్‌లోని పక్షుల జీవనశైలిని అధ్యయనం చేసేందుకు మేఘాలయలోని ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దులకు కూడా బయల్దేరబోతున్నారు. ఉల్ఫా తీవ్రవాదుల కల్లోలంతో ఇప్పటికే ఆయన ప్రయాణం ఒకసారి వాయిదా పడింది. ఈసారి ఏమైనా సరే వెళ్లి తీరాలన్న దృఢసంకల్పంతో ఉన్నారు రిషద్.
రిషద్ దశాబ్దాలుగా డేగలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. డేగ జాతిపై పరిశోధన కోసం 2011లో ‘రిసెర్చ్ అండ్ కన్సర్వేషన్ ఫౌండేషన్’ స్థాపించారు. ‘‘డేగలు క్రూరమైనవే. కానీ, అడవి ఎంత ఆరోగ్యంగా ఉందన్న విషయాన్ని వాటి ఉనికి చెబుతుంది’’ అంటారు రిషద్. ‘‘ముంబైలోని ‘హెచ్.ఆర్.కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనమిక్స్’ నుంచి పట్టభద్రుడైన రిషద్‌కు ఒక్కనాడైనా పక్షులు ఇచ్చినంత ఉత్సాహాన్ని కంపెనీ వ్యవహారాలు ఇవ్వలేదు’’ అని గోద్రెజ్ వంశవృక్షాన్ని గ్రంథస్థం చేసిన బి.కె.కరంజియా రాశారు.
చక్కగా పరిచివుంచిన దారిలో వెళ్లకుండా, తమకు నచ్చిన దారి వేసుకుంటూ వెళ్లేవారి గురించి రెండు ముక్కలు తెలుసుకున్నా చాలు, కొత్తగా రెక్కలు వచ్చినట్లు ఉంటుంది. అలా కొత్త ఆదర్శాలకు రెక్కలు తొడిగే పక్షి ప్రేమికుడే రిషద్ నౌరోజీ.
0 Reviews:
Post a Comment