Contact us

టీడీపీకి ఎలా ఓటేశారు?
టీడీపీకి ఎలా ఓటేశారు?: హరీష్‌రావు
జేపీ ఓటుపై చంద్రబాబును ప్రశ్నించిన హరీష్‌రావు
మీ మధ్య ఉన్నది సామాజిక బంధమా?
ఎన్టీఆర్‌ను దించిందీ, చెప్పులు వేయించిందీ నువ్వే కదా
అపార అనుభవం ఉందంటావు.. అయినా జగన్‌ను అనుసరిస్తావు

 
 సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ కాంగ్రెస్‌తో కుమ్మక్కైందని అంటున్న చంద్రబాబు.. లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ ఏ ప్రాతిపదికన టీడీపీకి ఓటేశారో చెప్పాలని టీఆర్‌ఎస్ శాసన సభాపక్ష ఉప నేత టి.హరీష్‌రావు డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యేలు ఏనుగురు రవీందర్‌రెడ్డి, జోగురామన్న, హనుమంతు షిండేలతో కలసి హరీష్ విలేకరులతో మాట్లాడారు. ‘‘తెలంగాణ ఎమ్మెల్యేలు ఈ ప్రాంత అభ్యర్థి కేశవరావు విజయానికి సహకరించుకోవడంలో ఒక పవిత్ర బంధం ఉంది. పారిశ్రామికవేత్తలకు సీట్లు ఇవ్వడం మీ విధానం.
 
 రాజకీయాల్లో  సంస్కరణల కోసం పనిచేస్తానంటున్న లోక్‌సత్తా పార్టీ నేత ఏ ప్రాతిపదికన మీ అభ్యర్థికి ఓటు వేశారు? మీ మధ్య ఉన్నది సామాజిక బంధమేనా’’ అని ప్రశ్నించారు. కేకే విజయాన్ని జీర్ణించుకోలేకే బాబు టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నారన్నారు.  ‘‘రాష్ట్ర రాజకీయాల్లో ఆయనంత అనుభవం మరెవ్వరికీ లేదని  చెప్పుకుంటున్న చంద్రబాబు ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డిని అనుసరిస్తున్నారు. కౌంటర్ రాజకీయాలు తప్ప ఏమి చేస్తున్నారు? తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ జగన్ జాతీయ నేతలను కలిస్తే ఈయనా జాతీయ నేతల్ని కలుస్తారు. జగన్ దీక్ష చేస్తే, ఈయన తరువాత ఢిల్లీలో దీక్ష చేస్తారు. ఆయన తండ్రిలా న్యాయం చేయాలంటే, ఈయన ఇద్దరు కొడుకులకూ సమన్యాయం అంటారు’’ అని ఎద్దేవా చేశారు. బీజేపీ నేత సుష్మాస్వరాజ్ వద్దకు చంద్రబాబు వెళ్లి వచ్చిన తరువాత టీటీడీపీ నేతలు వెళ్లి వినతిపత్రాలు అందజేయబోతే పార్టీ రెండు రకాల వైఖరిపై ఆమె కడిగి పారేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు ఆమోదంపై తమకు ఎలాంటి అనుమానాలూ లేవని హరీష్ అన్నారు.

0 Reviews:

Post a Comment