రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉంటామన్న వైసీపీ యూ టర్న్ తీసుకుంది! కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి ఆదాల ప్రభాకర రెడ్డికి మద్దతు తెలిపింది
ఈ మేరకు ఆదాలకు సమీప బంధువులైన మేకపాటి సోదరులు వైసీపీ అధిష్ఠానంతో మంతనాలు జరిపినట్లు తెలిసింది. తనకు మద్దతు ఇచ్చేందుకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సోమవారం స్వయంగా ఆదాలే 'ఆంధ్రజ్యోతి' ప్రతినిధికి తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలంటూ వైసీపీ సీజీసీ సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డితో ఆదాల మంతనాలు సాగించినట్లు తెలిసింది. అనంతరం, మేకపాటి సోదరులు జగన్‌తో చర్చించారు. కాగా, వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తే ఆదాల గెలుపు సాధ్యమేనన్న భావన వ్యక్తమవుతోంది. నెల్లూరు రాజకీయాల్లో ఆనం సోదరులకు చెక్ పెట్టాలంటే ఆదాల గెలుపు ఎంతో అవసరమని మేకపాటి సోదరులు భావిస్తున్నారు. వైసీపీ మద్దతుపై ఆదాలను ప్రశ్నించగా.. సమైక్యవాదంతో నడుస్తున్న వైసీపీతోపాటు సీపీ ఎం ఎమ్మెల్యేలు కూడా తనకు ఓట్లు వేస్తారని తెలిపారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే శ్రీధర్‌కృష్ణారెడ్డి కూడా మద్దతు ఇస్తున్నారన్నారు. అసెంబ్లీలో సమైక్యవాదులందరం కలిసి బిల్లును తిరస్కరించడంలో సఫలమయ్యామని, అలాగే, తనను గెలిపించి కేంద్రానికి సమైక్యాంధ్ర సత్తా చాటాలని ఆదాల పిలుపునిచ్చారు. రాజ్యసభకు పోటీ చేయాలని తొలుత తాను భావించలేదని, సమైక్యాంధ్ర ఎమ్మెల్యేల ప్రోత్సాహంతో అనూహ్యంగా బరిలో దిగాల్సి వచ్చిందని తెలిపారు. సమైక్యవాదులందరూ తనను సమర్థిస్తున్నారని, తనకు ఓటేసే విషయంలోనే ఎవరు సమైక్యవాదులో, ఎవరు విభజనవాదులో తేలిపోతుందన్నారు.andhrajyothy
0 Reviews:
Post a Comment