Contact us

చంద్రబాబును ఎంపీ గానే ఓడిస్తే..
చంద్రబాబునాయుడు తనకు మించిన రాజకీయ చతురుడు ఉండడేమోనని అనుకుంటారు. తనను గురించి తాను కాస్త ఎక్కువ ఊహించుకుంటూ తదనుగుణంగా పావులు కదుపుతుంటారు. ఇప్పుడు ఆయనలో తాజాగా కొత్త ఆశ మొలకెత్తింది. గతంలో ప్రధాని కాగల అవకాశాలు నాకు వచ్చినా కూడా నేను త్యాగం చేసేశాను అంటూ సన్నిహితుల వద్ద టముకు వేసుకుంటూ ఉండే చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ ప్రధాని పదవికి తానొక అభ్యర్థిగా ప్రొజెక్టు చేసుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు. తన అనుకూల మీడియాలో తదనుగుణమైన వార్తలు రాయించుకుంటున్నారు. ఆయన ఎన్డీయే తరఫున ప్రత్యామ్నాయ ప్రధాని అభ్యర్థి అవుతారంటూ అప్పుడే మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. 
భాజపా సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించగల పరిస్థితి రాకపోతే.. ఆ పార్టీ తనకు తానుగా 200 పై చిలుకు స్థానాల్లో విజయం సాధించలేని పరిస్థితి వచ్చినట్లయితే.. ఎన్డీయే కూటమిలో ఆల్రెడీ ఉన్న వారు కాకుండా.. ఇతర రాజకీయ పార్టీల మద్దతు కూడా కూడగట్టుకోవలసి వచ్చిన రోజున నరేంద్రమోడీని ప్రధానిగా వ్యతిరేకించే వారు బోలెడు మంది ఉన్నారు గాబట్టి.. తనను ప్రత్యామ్నాయ ప్రధాని అభ్యర్థిగా చెప్పుకుంటూ కొత్త కూటములను నిర్మించాలనేది చంద్రబాబు ప్లాన్‌. భాజపా నాయకులతో కూడా ఆయన ఈ విషయాలు చర్చిస్తున్నారు. మోడీతో కూడా భేటీ అయ్యారు. 
తృతీయ కూటమి కోసం మాత్రమే చూస్తున్న జయలలిత వంటి ఇతర పక్షాల నేతలతోనూ చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో తన స్వార్థానికి భాజపాతో పొత్తులను, మోడీని వాడుకోజూస్తున్నాడనే వాదన కమలదళాల్లో మొదలైంది. పైన చెప్పుకున్న కసరత్తు మొత్తం నిజమే అయితే గనుక.. ఎంపీగా బరిలోకి  దిగబోయే చంద్రబాబును కష్టపడి ఓడించి బుద్ధి చెప్పాలని కమలదళం భావిస్తున్నట్లు సమాచారం. భాజపాతో స్నేహం చేసినట్లే చేసి, తాను ప్రధాని కావడానికి ఆ పార్టీని మెట్లుగా వాడుకోవాలనుకుంటున్న చంద్రబాబు వ్యూహానికి ఆదిలోనే గండి కొట్టాలని.. చంద్రబాబును ఎంపీ గానే ఓడిస్తే.. ఒకవేళ భాజపా కూటమికి కొత్త పార్టీల అవసరం ఏర్పడినా.. ఎంపీగానే నెగ్గలేని వ్యక్తిని ప్రధాని ఎలా చేయగలరనేది వారి ఆశ!
చంద్రబాబు ఎలాంటి వ్యూహంతో ఉన్నారో గానీ.. మోడీ యిజంలో భాజపా మొత్తం మహోత్సాహంతో కదులుతుండగా, మోడీకే చెక్‌ పెట్టే యోచనకు ఆయన ఎందుకు వచ్చారో తెలియదు. అయితే దీనివలన ఆయనకు నష్టమే ఎక్కువని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. భాజపాకు అనుమానం కలిగితే గనుక.. పైకి పొత్తులున్నా.. రాష్ట్రంలో తెదేపాకు ప్రతికూలంగా వారి అంతరాత్మ పనిచేస్తుందని, మోడీని మోసం చేయడానికి చంద్రబాబు తెగబడుతున్నాడనే ఫీలింగ్‌ ప్రజలకు కలిగితే అది ఇంకా చేటు చేస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 
- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/chandrababu-otamiki-dalapathulu-50221.html#sthash.DMHNBfWZ.dpuf

0 Reviews:

Post a Comment