Contact us

కోతి  ‘కొలువు’ ముంచిందని..
కొలువు ముంచిన ‘కోతి’
రణస్థలం, న్యూస్‌లైన్: అసలే కోతి.. ఆపై కల్లు తాగింది.. అనేది నానుడి... అయితే ఇక్కడ మనం చెప్పుకొనే కోతి కల్లు తాగిందో లేదో గానీ.. ఒక వికలాంగ నిరుద్యోగి జీవితంతో మాత్రం చెలగాటమాడింది. ఆదివారం జరిగిన వీఆర్వో పరీక్ష రాయనివ్వకుండా చేసింది. కోతేంటి.. పరీక్ష రాయనివ్వకపోవడమేంటి?! అని అంటారా?

 శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కేశుదాసుపురం గ్రామానికి చెందిన వికలాంగుడు లింగాల రమేష్ రణస్థలంలో వీఆర్వో పరీక్షకు హాజరయ్యేందుకు చిలకపాలెం బస్టాప్‌కు చేరుకున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ కోతి అమాంతం అతడి భుజాలపెకైక్కి కూర్చుంది. ఎంతమంది అదిలించినా, బెదిరించినా ఏమాత్రం బెణుకు లేకుండా అలాగే ఉండిపోయింది. పరీక్షకు టైం అవుతుండడంతో కంగారుపడిన రమేష్ కోతితో సహా ఆటో ఎక్కి పరీక్ష కేంద్రానికి చేరుకున్నాడు. అయితే, పరీక్ష కేంద్రం నిర్వాహకులు కోతితోపాటు అతడ్ని లోపలకు అనుమతించేందుకు ఒప్పుకోలేదు. అతడు విషయం వివరించినా వారు వినలేదు. స్థానికులు కోతిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో రమేష్ మళ్లీ ఆటో ఎక్కి స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి గోడు వెళ్లబోసుకున్నాడు. వెంటనే స్పందించిన హెడ్‌కానిస్టేబుల్ అడివన్న వల తెప్పించి స్థానికుల సహాయంతో కోతిని పట్టుకున్నారు.
 
అనంతరం ఒక యువకుడి బైక్‌పై రమేష్‌ను పరీక్షా కేంద్రానికి పంపించాడు. అయితే పరీక్ష ప్రారంభమై అరగంట దాటిపోవడంతో నిర్వాహకులు లోపలకు అనుమతించలేదు. చేసేది లేక బాధితుడు ఉసూరుమంటూ ఇంటి ముఖం పట్టాడు. వికలాంగుడి కోటాలోనైనా ఉద్యోగం పొందాలని, కోచింగ్ తీసుకుని మరీ పరీక్ష ప్రిపేర్ అయ్యానని, కోతి తన ‘కొలువు’ ముంచిందని రమేష్ వాపోయాడు. ఎంత ప్రాధేయపడినా పరీక్షా కేంద్రం అధికారులు కనికరించకపోవడం బాధగా ఉందన్నాడు. సోమవారం గ్రీవెన్స్‌సెల్‌కు వెళ్లి జిల్లా కలెక్టర్‌కు  విన్నవించుకుంటానని చెప్పాడు

Sakshi

0 Reviews:

Post a Comment