Contact us

మోడీ విషయంలో పునరాలోచనలో పడ్డ 'పెద్దన్న'
మోడీ విషయంలో పునరాలోచనలో పడ్డ 'పెద్దన్న'
న్యూఢిల్లీ : బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై అమెరికా తన వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తోంది. గుజరాత్ రాష్ట్రంలో 2002లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ 2005లో మోడీ వీసాను రద్దు చేసిన విషయం తెలిసిందే. తమ వీసా విధానంలో ఎలాంటి మార్పు లేదని అమెరికా ఇన్నాళ్లుగా పదే పదే చెబుతూ వస్తోంది. కానీ ఇప్పుడు మాత్రం మోడీని వ్యతిరేకించే విషయంలో అగ్రరాజ్యం పునరాలోచనలో పడింది. భారత్ లోని అమెరికా రాయబారి నాన్సీ పావెల్‌ ఈ నెల 14న మోడీని గాంధీనగర్ లో సమావేశం కానున్నారు.

మోడీ అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, దానిపై ప్రస్తుతమున్న నియమ నిబంధనల ప్రకారమే నిర్ణయం తీసుకుంటామని అమెరికా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాకుండా ఇటీవలే అక్కడి అత్యంత ప్రభావవంతమైన 'టైమ్' పత్రిక తన సంపాదకీయంలో మోడీ ప్రధాని అయితే అప్పుడు కూడా వీసా నిరాకరించగలరా అంటూ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి నుంచి అమెరికా స్వరంలో కొంత మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు మోడీతో భేటీ కూడా అందుకు భాగంగానే భావిస్తున్నారు.

0 Reviews:

Post a Comment