Contact us

పురందేశ్వరి,షర్మిల లు విశాఖలో పోటీచేస్తే...




విశాఖపట్నం లోక్ సభ నియోజకవర్గం నుంచి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ సోదరి, షర్మిల ఎన్నికల బరిలోకి దిగితే అక్కడ పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంటుంది. కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి మరోసారి అక్కడ నుంచి పోటీచేయడానికి సిద్దం అవుతున్నారు.ఆమె కాంగ్రెస్ పక్షానే రంగంలో దిగవచ్చు.తొలుత పురందేశ్వరికి రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డి టిక్కెట్ రేసులో పోటీ వచ్చి చికాకు పెట్టినా, ఇప్పుడు ఆయనకు రాజ్యసభ సీటు వచ్చినందున పోటీనుంచి తప్పుకున్నట్లే భావించవచ్చు.ఒకవేళ అనూహ్యంగా రాజ్యసభ ఎన్నికలలో సుబ్బరామిరెడ్డి విజయం సాధించకపోతే ఎలా ఉంటుందో చెప్పలేం. కాని ఆయన విజయానికి అవకాశాలు ఉన్నాయనే నమ్ముతున్నారు.పురందేశ్వరి తో షర్మిల పోటీ పడితే రాష్ట్రం దృష్టినే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయవర్గాలు ఈ నియోజకవర్గంపై ఆసక్తి చూపుతాయి. పురందేశ్వరి మాజీ మంత్రి సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్యనే కాక, దివంగత నేత, టిడిపి వ్యవస్థాపక అద్యక్షుడు ఎన్.టి.రామారావు కుమార్తె కావడం ప్రత్యేకత.అలాగే షర్మిల కూడా జగన్ సోదరి అవడంతో పాటు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుమార్తె కావడంతో ప్రాధాన్యత ఉంటుంది.పురందేశ్వరి విశాఖపట్నంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు ఆమె సుబ్బరామిరెడ్డి వివాదం తప్ప, మరే వివాదంలోను లేరు.వీలైనన్ని అబివృద్ది పనులు చేయడానికి ప్రయత్నించారు.అయితే కాంగ్రెస్ పార్టీపై ప్రస్తుతం జనంలో బాగా వ్యతిరేకత ఉంది.దానిని అధిగమించవలసిన పరిస్థితి ఉంటుంది.ఇక షర్మిల తన పాదయాత్ర ద్వారా, వివిధ యాత్రల ద్వారా ప్రజలను విశేషంగా ఆకర్షించారు. ఆమె స్వయంగా పోటీ వల్ల వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు ఉత్సాహం వస్తుంది. అయితే విశాఖలో పార్టీ నిర్మాణం ఎంత బలంగా ఉందన్నది ఇంకా తెలియదు.అయితే అదే జిల్లాలోని పాయకరావు పేటలో జరిగిన ఉప ఎన్నికలో ఆ పార్టీ గెలుపొందడం ప్లస్ పాయింట్.సీనియర్ నేతలు కొణతాల రామకృష్ణ,దాడి వీరభద్రరావు వంటి వారు షర్మిల విజయానికి ప్లాన్ చేయవలసి ఉంటుంది. అయితే అనకాపల్లి ఎమ్.పి సబ్బం హరి తో ఏర్పడిన విభేదాల వల్ల ఆయన పార్టీకి దూరం అయ్యారు. ఆయన వర్గం సహజంగానే ఈమెను ఓడించడానికి ప్రయత్నిస్తుంది. ఇక టిడిపి అభ్యర్ధి ఎవరన్నది తేలలేదు. ఆ పార్టీ అభ్యర్ధి కూడా రాష్ట్రవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించగలిగే వ్యక్తి అయితే పోటీ రంజుగా మారుతుంది. మొత్తం మీద విశాఖపట్నం ఇద్దరు అతివల మధ్య రాజకీయ సమరానికి కేంద్రం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

0 Reviews:

Post a Comment